30 March, 2026 | 2:19 AM

అత్తను హత్య చేసిన కోడలు

30-03-2026 12:30 AM

24 గంటల్లోనే కేసును ఛేదించిన గాంధారి పోలీసులు

వృద్ధురాలి హత్య కేసును ఛేదించిన గాంధారి పోలీస్ టీంను అభినందించిన జిల్లా ఎస్పీ 

కామారెడ్డి, మార్చి 29 (విజయక్రాంతి): అత్తను హత్య చేసిన కోడలు ను పోలీసులు 24 గంటల్లో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ  రాజేష్ చంద్ర కథనం ప్రకారం వృద్ధురాలి హత్య కేసు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతాయిపల్లి గ్రామంలో అత్త ను నమ్మించి కోడలు గొంతు కోసింది.

అత్తను అత్యంత కిరాతకంగా చంపి, ఏమీ ఎరగనట్లుగా కోడలు డ్రామా ఆడింది. కానీ, గాంధారి పోలీసుల నిశిత విచారణలో ఆ కోడలే నేరం చేసినట్లు తెలిసింది. సీతాయిపల్లి గ్రామంలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య కేసును కేవలం 24 గంటల్లోనే సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం కేసును 24 గంటల్లో ఛేదించి, నిందితురాలిని కటకటాల్లోకి నెట్టారు.

 ఈనెల 28న గాంధారి పోలీసులకు లింగంపేట మండలం భవాని పేట గ్రామానికి చెందిన  సజ్జనపల్లి  శాంతవ్వ, ఫిర్యాదు చేయగా, ఆమె అన్న కొడుకు బాలరాజు ద్వారా తమ తల్లి రుక్మవ్వ సీతాయిపల్లి గ్రామంలో హత్యకు గురైనట్లు శనివారం తెలియడంతో  ఫిర్యాదురాలు భవానిపేట్ నుండి సీతయ్యపల్లి గ్రామానికి వెళ్లి తన తల్లిని పరిశీలించగా హత్యకు గురైనట్లు గమనించి గాంధారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం వృద్ధురాలు హత్య కేసును 24 గంటలు చేదించారు. వృద్ధురాలి చెవి కమ్మలు, మెడలో ఉన్న బంగారు గుండ్లు కనిపించకపోవడం, ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా ఉండడం గుర్తించారు.

ఈ విషయంపై అనుమానం వ్యక్తం చేస్తూ, ఫిర్యాదురాలు తన వదిన కోటవ్వను ప్రశ్నించగా, బాధితురాలు కిందపడడంతో తలకు గాయం అయ్యి చనిపోయిందని తెలిపినది. అయితే మధ్యాహ్నం సుమారు 3:30 గంటలకు మృతదేహానికి స్నానం చేయించే సమయంలో తలకు ఏదో ఆయుధంతో కొట్టినట్లుగా, ఎడమ వైపు తీవ్ర గాయం ఉన్నట్లు గుర్తించబడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఫిర్యాదురాలు తన తల్లి మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ, గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉండవచ్చని గాంధారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో యెల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో  సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు, మృతురాలి కోడలు అయిన కావటి కోటవ్వపై అనుమానం వ్యక్తం చేసి, సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, గాంధారి ఎస్‌ఐ ఆంజనేయులు ఘటన స్థలానికి చేరుకొని, అనంతరం హత్యకు గల వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకొని నిందితురాలు అయిన మృతురాలి కోడలు కోటవ్వను అదుపులోకి తీసుకుని విచారించారు. కోటవ్వ రాయితో రుక్మవ్వను తలపై కొట్టి చంపి, ఆమె మెడలో ఉన్న సుమారు 1.5 తులాల బంగారు గుండ్లు, బంగారు కమ్మ దొంగతనం చేసినట్లు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

కేసు వివరాల్లోకి వెళితే, 

గాంధారి మండలంలోని సీతయ్యపల్లి గ్రామానికి చెందిన కావటి రుక్మవ్వ (73)కు ముగ్గురు కుమారులు కలరు. ముగ్గురు కుమారుల్లో పెద్ద కుమారుడు, నడిపి కుమారుడు మృతి చెందగా, చిన్న కుమారుడు హైదరాబాదులో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇందులో నడిపి కుమారుడైన భూమయ్య భార్య అయిన కోటవ్వకు మృతురాలు రుక్మవ్వతో అనేకసార్లు బంగారం, డబ్బుల విషయాలలో గొడవలు జరిగేవి. గత కొన్ని రోజుల క్రితం కోడలు అత్తను డబ్బులు అడగగా ఇవ్వకపోవడంతో కక్ష పెంచుకొని, అత్త దగ్గర ఉన్న బంగారం, నగదును కాజేయాలనే ఉద్దేశంతో, ఈనెల 28 న రాత్రి డబ్బులు ఇవ్వలేదని  దూషించిందని కోపంతో, కోడలు తెల్లవారుజామున అత్త పడుకున్న ఇంటికి వెళ్లి రాయితో తలపై దాడి చేసి హత్య చేసింది.

హత్య అనంతరం ఘటనను బయటపడకుండా ఉండేందుకు రక్తపు ఆనవాళ్లను తుడిచేసి, బంగారు ఆభరణాలు దొంగిలించింది. కావటి కోటవ్వ, సీతయ్యపల్లి గ్రామం. నిందితురాలి వద్ద నుండి  13.8 గ్రాముల బంగారు గుండ్లు, 1.2 గ్రాముల బంగారు చెవి కమ్మ ఒకటి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆదివారం నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిం చారు. వృద్ధురాలు హత్య కేసును  24 గంటల్లో అత్యంత వేగంగా ఛేదించిన సదాశివనగర్ సీఐ బి. సంతోష్ కుమార్, గాంధారి ఎస్‌ఐ ఆంజనేయులు, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రవి కుమార్, కానిస్టేబుల్ లు  సాందీప్, జానకిరాము, లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యేకంగా అభినందించారు.