03-12-2025 01:19:54 AM
సింగరేణి సంస్థ సీఎండీ బలరామ్
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): సింగరేణి వ్యాప్తంగా ఉన్న బొగ్గు మైనింగ్ వ్యర్థాల నుంచి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఇతర కీలక ఖనిజాలను అన్వేషించి వాటిని వెలికి తీసేందుకు ప్రముఖ పరిశోధన సంస్థ సీఎస్‌ఐఆర్- ఇనిస్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ (సీఎస్‌ఐఆర్-ఐఎంఎంటీ) తో సంయుక్త భాగస్వామ్యంతో పని చేసేందుకు సింగరేణి కాలరీస్ కీలక ఒప్పందం చేసుకుంది.
ఈ ఒప్పందంలో భాగంగా సింగరేణి ప్రాంతాల్లో షేల్, మట్టి, సాండ్‌స్టోన్, గ్రానైట్ రాళ్లు, బొగ్గు ఫ్లు యాష్, బాటమ్ యాష్‌లలో నిక్షిప్తమై ఉన్న కీలక ఖనిజాలను వెలికితీయనున్నారు. మంగళవారం సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ సమక్షంలో ఈ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించేందుకు అనుగుణంగా ఒప్పంద పత్రాలపై ఇరువర్గాలు సంతకాలు చేశారు.
బలరామ్ మాట్లాడుతూ...కీలక ఖనిజ రంగంలో పరస్పర సహకారం కోసం ఈ ఏడాది జూన్‌లో తొలుత ఒక అవగాహనను కుదుర్చుకున్నామని, తాజా ఒప్పందంతో ఈ ప్రాజెక్టు ప్రారంభానికి బలమైన ముందడుగు పడిందన్నారు. ఐఎంఎంటీ డైరెక్టర్ డాక్టర్ రామానుజ నారాయణ్ మాట్లాడుతూ పారిశ్రామిక వ్యర్థాల నుండి క్రిటికల్ మినరల్స్ వెలికితీత, స్వదేశీ సాంకేతిక పద్ధతుల అభివృద్ధి ప్రధాన లక్ష్యమన్నారు