03-12-2025 01:19:49 AM
కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం, సంక్షేమం దృష్ట్యా వారి కోసం ప్రత్యేక వైద్య కేంద్రం ఏర్పాటు చేసి సేవలు అందిస్తామని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మంగళవారం వారధి సొసైటీ సహకారంతో మున్సిపల్ కార్మికులకు పిపిఈ కిట్ల పంపిణీ కార్యక్రమం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయితో కలిసి కార్మికులకు రక్షణ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు విధిగా పిపిఈ కిట్లను ధరించాలని, ఆరోగ్య జాగ్రత్తలను తప్పక పాటించాలని సూచించారు. ఇప్పటికే మునిసిపల్, పంచాయతీ కార్మికులకు జిల్లా యంత్రాంగం తరఫున ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తున్నామని అన్నారు.
ప్రస్తుతం కార్మికులు, జవాన్లు, ఇన్స్పెక్టర్లు, శానిటేషన్ వర్కర్లు ఎలక్ట్రిసిటీ కార్మికులతో సహా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న సిబ్బందికి 30 లక్షల ప్రమాద బీమా చేయించామని వివరించారు. కార్మికుల శ్రేయస్సు కోసం ప్రత్యేక వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహినుద్దీన్, వేణుమాధవ్, మెడికల్ ఆఫీసర్ సుమన్, వారధి సొసైటీ మెంబర్ సెక్రటరీ ఆంజనేయులు, తదితరులుపాల్గొన్నారు.