30 July, 2026 | 3:54 AM

రైతుల కోసం వ్యవసాయ యంత్రాలు

03-09-2025 01:13 AM

మంచిర్యాల,(విజయక్రాంతి): వ్యవసాయ సాగును సులభతరం చేసేందుకు ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం సాయంత్రం తన ఛాంబర్ లో జిల్లా వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి, బ్యాంకింగ్, ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖల అధికారులతో వ్యవసాయ యాంత్రికరణ, జాతీయ ఆహార భద్రత పథకం అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రైతుల శారీరక శ్రమను తగ్గించి వ్యవసాయ సాగులో పనిముట్ల వినియోగాన్ని పెంపొందించి పంట సాగును సులభతరం చేసేందుకు ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా అవకాశం కల్పిస్తుందన్నారు.

వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 2.35 కోట్లు

2025 - 26 సంవత్సరానికి గాను వ్యవసాయ యాంత్రీకరణ పథకం జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ వెల్లడించారు. ఇందు కోసం జిల్లాలోని అన్ని మండలాలలో లబ్ధిదారుల ఎంపికకు కార్యచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. మొక్కల సంరక్షణ, ట్రాక్టర్ సహాయ పరికరాలతో పాటు వివిధ రకాలైన పరికరాలను వినియోగించి జిల్లాలోని 3,458 హెక్టార్లలో పంట సాగు కోసం రూ. 2.35 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. ఈ పథకంలో ఎస్. సి., ఎస్. టి., మహిళా రైతులు, చిన్న కమతాల రైతులకు 50 శాతం రాయితీ, పెద్ద కమతాలు, మిగతా రైతులకు 40 శాతం రాయితీతో పరికరాలు అందించడం జరుగుతుందన్నారు.

జాతీయ ఆహార భద్రత, పోషణ పథకం కోసం నిధులు

2025 - 26 సంవత్సరానికి జాతీయ ఆహార భద్రత, పోషణ పథకం కింద వానాకాలం, యాసంగి సీజన్ లకుగాను 4,432 హెక్టార్లలో వరి ధాన్యం, పప్పు ధాన్యాలు, పత్తి పంటలు సాగు చేసేందుకు రూ. 57 లక్షల లక్ష్యంతో ఆమోదించడం జరిగిందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఈ పథకం కింద వానాకాలం 2025కు గాను 100 శాతం రాయితీతో 24 క్వింటాళ్ల వరి (డెమో), 50 శాతం రాయితీతో 66.8 క్వింటాళ్ల వరి (సాధారణ) విత్తనాలను పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని మండలాలలో ఈ పథకం అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వరి విత్తనాలతో పాటు సేంద్రియ ఎరువులు, పీపీ కెమికల్స్ పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో వ్యవసాయ సాగు విస్తీర్ణం పెంపొందించే దిశగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కోరారు.