03-09-2025 01:10:52 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న సందర్భంలో నోటాను ఒక కల్పిత అభ్యర్థిగా గుర్తిస్తూ, నిర్ణయం తీసుకోవాలని రాష్ర్ట ఎన్నికల సంఘాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి కోరారు. ఎన్నికలలో పోలింగ్ శాతం పెంచడానికి, అలాగే వ్యతిరేక ఓటు నమోదు కోసం సుప్రీంకోర్టు -2013లో నోటాను ప్రవేశపెట్టిందని చెప్పారు. అయితే నోటాకు అత్యధిక ఓట్లు వచ్చినా పరిగణలోకి తీసుకోకుండా..
అత్యధిక ఓట్లు సాధించిన రెండవ అభ్యర్థిని ఎన్నిక అయినట్లు ప్రకటిస్తున్నారని, దీంతో నోటా నామమాత్రంగానే ఉండిపోతున్నదని చెప్పారు. ఈ కారణంగా తెలం గాణలో చాలా గ్రామాల్లో సర్పంచ్ పోస్టులను హర్రాజు చేయడం, ఎక్కువ ధర పలికిన అభ్యర్థిపై ఎవరూ నామినేషన్ వేయకుం డా కట్టడి చేసి, ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యేటట్లు చూస్తున్నారని పేర్కొన్నారు. దీనికి తోడు ఏకగ్రీవంతో పేదలకు ఓటు హక్కు వినియోగించుకుకుండా పోతున్నది.
గత పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణలో 16 శాతం గ్రామపంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నుకోబడి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు పేదలకు లేకుండా పోయిందన్నారు. ఇటువంటి అప్రజాస్వామిక పద్ధతిని ఎన్నికల సంఘం అరికట్టాలని కోరారు. త్వరలో జరగబోరయే స్థానిక ఎన్నికల్లో నోటాను కల్పిత అభ్యర్థిగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవాలని పద్మనాభరెడ్డి కోరారు.