30 July, 2026 | 2:50 AM

ప్రభుత్వంతో ఉద్యోగుల చర్చలు సఫలం

03-09-2025 01:13 AM
  1. డిమాండ్లను పరిష్కరిస్తామని రాతపూర్వక హామీ  
  2. ‘బస్సు యాత్ర, ఛలో హైదరాబాద్’ వాయిదా 
  3. ఉద్యోగ సంఘాల జేఏసీతో క్యాబినెట్ సబ్‌కమిటీ భేటీ
  4. నేతలలో చర్చించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌బాబు
  5. హెల్త్ కార్డుల మంజూరుకు ప్రభుత్వం అంగీకారం
  6. త్వరలో పీఆర్‌సీ అమలు, సీసీఎస్ రద్దుకు కమిటీ  
  7.   8న జరిగే భేటీలో హెల్త్ కార్డుల విధి విధానాలు ఖరారు 
  8. సబ్ కమిటీతో భేటీ అనంతరం వెల్లడించిన ఉద్యోగుల జేఏసీ  

హైదరాబాద్, సెప్టెంబర్2 (విజయక్రాంతి): ప్రభుత్వంతో తెలంగాణ ఉద్యో గ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారులు, కార్మికులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (తెలంగాణ ఉద్యోగుల జేఏసీ) జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ డి మాండ్లను పరిష్కరించాలని 20 నెలలుగా కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకో కపోవడంతో సెప్టెంబర్ 8 నుంచి 19 వరకు జిల్లాల బస్సు యాత్ర, అక్టోబర్ 12న ఛలో హైదరాబాద్ ఉద్యమ కార్యాచరణను గత నెలలో ఉద్యోగుల జేఏసీ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దిగొచ్చి జేఏసీ నేతలు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు, బీ.శ్యామ్, దామోదర్ రెడ్డి, సదానందం గౌడ్, చావా రవి, ఏ.సత్యనారాయణ, మధుసూదన్‌రెడ్డితోపాటు మ రికొందరు జేఏసీ నేతలతో సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కూ డిన క్యాబినెట్ సబ్ కమిటీ, అధికారుల కమిటీ సమావేశమై సుధీర్ఘంగా చర్చించారు. జేఏసీ డిమాండ్లకు ప్రభుత్వం అం గీకరిచిందని, వరుస క్రమంలో పరిష్కరిస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చిన ట్లు తెలిపడంతో ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది.

8న మరోసారి సమావేశం: ఏలూరి శ్రీనివాస రావు, జేఏసీ సెక్రటరీ జనరల్

ఈనెల 8న మరోసారి సీఎస్‌తో ఉద్యోగుల జేఏసీ భేటీ అయి ఉద్యోగుల హెల్త్ కార్డుల మంజూరుకు విధివిధానాలు మంజూరు చేయనున్నట్లు జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు తెలిపారు. అలాగే ఉపాధ్యాయులు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు, జాయింట్ స్టాఫ్ ఆఫ్ కౌన్సిల్ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరిచిందన్నారు. సచివాలయంలో ఉద్యోగుల వాటా, అధికారుల అద్దె వా హనాల బిల్లులు మంజూరు, వచ్చే ఏడా ది మార్చి 31 వరకు పీఆర్‌సీ సమస్యను పరిష్కరిస్తామని, కొత్త జిల్లాల్లో క్యాడర్ స్ట్రెంత్ అమలు తదితర సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలిపారు. 

ఉపాధ్యాయుల సమస్యల కోసం ప్ర త్యేకంగా విద్యాశాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహి స్తామని తమకు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులు ప్రభుత్వం వేర్వేరు కాదని,  సుపరిపాలన కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం అందరం కృషిచేద్దామని మంత్రులు పిలుపునిచ్చినట్లు తెలిపారు.

జేఏసీ అదనపు ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్ రెడ్డి మాట్లాడూతూ ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలను పరిష్క రించాలని, పర్యవేక్షణ అధికారులు లేరని, వెంటనే నియమించాలని కోరినట్లు తెలిపారు. సమావేశంలో జేఏసీ నేతలు కటకం రమేశ్, వంగ రవీందర్ రెడ్డి, కస్తూరి వెంకటేశ్, స్థితప్రజ్ఞ, అబ్దుల్లా, బీ.కొండయ్య, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరిస్తామన్నారు: మారం జగదీశ్వర్, జేఏసీ చైర్మన్

మంత్రులతో చర్చల అనంతరం జేఏసీ నేతలు నాంపల్లిలోని టీజీవో భవన్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ..ప్రభు త్వం తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినందుకు ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిందన్నారు.

ఇప్పటికే కొన్ని డిమాండ్లను పరిష్కరించిందని, పీఆర్‌సీ రిపోర్టు తెప్పించుకొని అమలు చేస్తామని స్పష్టమైన హామీనిచ్చినట్లు తెలిపారు. సీపీఎస్ రద్దుకు అధికారులతో చర్చించి, మిగతా రాష్ట్రాల్లో ఏవిధంగా ఉందో పరిశీలించేందుకు అవసరమైతే కమిటీ వేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. పీఆర్‌సీతోపాటు డీఏ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రులు చెప్పినట్లు వెల్లడించారు.

మెడికల్ బిల్లులు రూ.180 కోట్లను గతంలోనే విడుదల చేయగా, ఆగస్టు నెల చివరన పెండింగ్ బకాయిలు రూ.700 కోట్లను విడుదల చేసిందని, మిగతా పెండింగ్ బిల్లులను కూడా నెలకు రూ.700 నుంచి రూ.750 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటుకు హామీ, రెండేళ్లుగా సస్పెన్షన్‌లో ఉన్న ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇవ్వడంతోపాటు ఏసీబీ కేసులతో సస్పెన్షన్‌లో ఉన్న ఉద్యోగులకు పోస్టింగ్‌లకు ప్రభుత్వం అంగీకరించినట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో తమ కార్యాచరణ కొనసాగుతుందని తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తామని, త్వరలో స్థానిక ఎన్నికలు, రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కార్యాచరణను వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరినట్లు ఆయన పేర్కొన్నారు.