7 April, 2026 | 2:21 AM

తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలకు వ్యవసాయం కీలకం

07-04-2026 12:00 AM
  1. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

ఇక్రిసాట్లో కొడంగల్ రైతుల శిక్షణా కార్యక్రమానికి హాజరు

సంగారెడ్డి, ఏప్రిల్ 6 (విజయక్రాంతి) : ప్రజా పాలనప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ , ఇక్రిశాట్ సంయుక్త ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గానికి చెందిన యువ రైతులకు సాయిల్ హెల్త్ వాలంటీర్లు గా రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఇక్రిశాట్ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిం చారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాలకు చెందిన ప్రతి గ్రామం నుంచి ఒక్కొక్క రైతును ఎంపిక చేసి సాయిల్ హెల్త్ వాలంటీర్గా శిక్షణ అందించడం జరుగుతుందని వ్యవసాయ అధికారులు  తెలిపారు. ఈ శిక్షణలో భూసార పరీక్షలు, పంటల ఎంపిక, పంటల సరళి మార్పులు, వాతావరణ పరిస్థితుల ప్రభా వం, అంతర్ పంటల సాగు, సేంద్రీయ వ్యవసాయం వంటి అంశాలపై నిపుణులు వివరంగా అవగాహన కల్పిస్తున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యాలకు అనుగుణంగా వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడం, అగ్రిటెక్ వినియోగాన్ని ప్రోత్సహించడం,  లాభసాటి పంటలు,  పంటల విలువ ,వృద్ధి ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.  రైతుల ప్రధాన ఆస్తి భూమి అని, భూమి ఆరోగ్యంగా ఉంటేనే పంటల దిగుబడులు పెరిగి రైతుల ఆదాయం మెరుగుపడు తుందని పేర్కొ న్నారు.

భూమి  ఆరోగ్య పరిరక్షణపై రైతుల్లో అవగాహన పెంచడంలో సాయిల్ హెల్త్ వాలంటీర్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు. శాస్త్రీయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం గ్రామీణ స్థాయికి చేరేలా వాలంటీర్లు కృషి చేయాలని తెలిపారు.  రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూమి సారవంతత దెబ్బతిం టోందని పేర్కొన్నారు . పంటలమార్పిడి  ద్వారా భూసారం పెంపొందించవచ్చని సూచించారు .

రైతులు బయో ఫెర్టిలైజర్లు, సేంద్రీయ ఎరువులు వినియోగించడం ద్వారా భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు . అంతర్ పంటల సాగు ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందడమే కాకుండా నేల గుణాత్మకతను కూడా మెరుగుపరచవచ్చని అన్నారు.  వ్యవసాయ యాంత్రిక పద్ధతులు ,టెక్నాలజీ ఆధారంగా లాభదాయక వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రభుత్వం సంకల్పించిం దన్నారు.   

వ్యవసాయ ముఖ్య శాఖ కార్యదర్శి సురేంద్ర మెహన్, ప్రొఫెసర్ జయ శంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ  వైస్ ఛాన్సలర్ డాక్టర్ జానయ్య, కొండా  లక్ష్మణ్  హార్టీకల్చరల్  యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజిరెడ్డి, హార్టికల్చర్ శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్, డిప్యూటీ  డైరెక్టర్ జనరల్ స్టాన్ఫోర్డ్ బ్లాడే, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు, వాలంటీర్లు పాల్గొన్నారు.