7 April, 2026 | 2:19 AM

సింగూర్ నుంచి ఘనపూర్‌కు నీరు విడుదల చేయాలి

07-04-2026 12:00 AM
  1. రైతుల పంటలు ఎండిపోతున్నాయి 0.3 టీఎంసీ నీరు విడుదల చేయాలి

నీరు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు

మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి

మెదక్, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి) : సింగూర్ ప్రాజెక్ట్ నుంచి ఘనపూర్ ఆయకట్టకు వెంటనే సాగు నీటిని విడుదల చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతిమా సింగ్కు బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు, కౌన్సిలర్లతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి  మాట్లాడుతూ.. సింగూర్ ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆయకట్టకు అత్యవసరంగా 0.3 టీఎంసీ నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.

ఘనపూర్ ఆయకట్టు కింద పంటలు ప్రస్తుతం కీలకమైన పొట్ట దశలో ఉండగా నీటి కొరత కారణంగా ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్రాప్ హాలిడే ప్రకటించక ముందే రైతులు పంటలు వేసుకున్నారని, ఆలస్యంగా ప్రకటించడం వల్ల వారు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. పంట చేతికి వచ్చే ఈ సమయంలో ఒక తడి నీరు అందిస్తే పంటలు కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. అందువల్ల రైతులు నష్టపోకుండా ఉండేందుకు సింగూర్ ప్రాజెక్ట్ నుంచి ఘనపూర్ ఆనకట్టకు వెంటనే 0.3 టీఎంసీ నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

మెట్రో వాటర్ వరక్స్ వద్ద ఫైల్ తిరస్కరణ పేరుతో నీటి విడుదలను ఆపడం సమంజసం కాదని అన్నారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్కు సింగూర్ ప్రాజెక్ట్తో సంబంధం లేదని స్పష్టం చేశారు. రైతుల పంటపొలాలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని, స్థానిక ఎమ్మెల్యేకు ఈ పరిస్థితి కనిపించడంలేదా అని ప్రశ్నించారు. 

మంజీరా నది వరకు వచ్చిన నీటిని ఘనపూర్ ఆనకట్టకు తీసుకురావడానికి శక్తి లేదా అని ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల కష్టాలను గుర్తించాలని, పంట వేసే ముందు క్రాప్ హాలిడే ప్రకటించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. పంటలు వేసిన తర్వాత క్రాప్ హాలిడే ప్రకటించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సింగూర్ నుంచి ఘనపూర్కు వెంటనే 0.3 టీఎంసీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రెండు రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరుతూ, లేకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. లేనిపక్షంలో రైతులతో కలిసి హైదరాబాద్లోని హెచ్‌ఆర్సీని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యకురాలు యం.లావణ్య రెడ్డి,

మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిండ్ల ఆంజనేయులు, కోకన్వీనర్‌లు గడ్డమీద కృష్ణ గౌడ్, లింగారెడ్డి  మెదక్, హవేళిఘనాపూర్ మండలాల పార్టీ అధ్యక్షులు యం.ఆంజ గౌడ్, సిహెచ్. శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ లు బట్టి. ఉదయ్, జుబెర్ అహ్మద్, గౌస్, మాజీ కౌన్సిలర్ లు మాయ మల్లేశం, ఆర్కే. శ్రీనివాస్, మాజీ సర్పంచ్ లు, మెదక్, పాపన్నపేట్, హవెలిఘనపూర్ మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు.