25 March, 2026 | 2:48 AM

క్షయ వ్యాధి అంతానికి ఏఐ ఆధారిత మ్యాపింగ్

25-03-2026 01:18 AM

మహబూబాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): క్షయవ్యాధిని అంతం చేయడానికి ఏ ఐ ఆధారిత మ్యాపింగ్ ద్వారా మహబూబాబాద్ జిల్లాలో 69 అధిక ప్రమాదం ఉన్న గ్రామాలు, వార్డులను గుర్తించి 14 సంవత్సరాల కు పైగా వయసు గల వారికి స్క్రీనింగ్ నిర్వహించడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు జిల్లా టిబి ప్రోగ్రాం అధికారి డాక్టర్ విజయకుమార్ తెలిపారు.

టీబీ నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ‘అవును! మనం క్షయను అంతం చేయగలం!’ అనే నినాదంతో ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన పెంపొందించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.100 రోజుల ప్రచార కార్యక్రమమైన ’టీబీ ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఏ ఐ ఆధారిత మ్యాపింగ్ ప్రకారం, సమన్వయంతో కూడిన విస్తృత ప్రచారం, పటిష్టమైన రోగ నిర్ధారణ, సామాజిక భాగస్వామ్యం ద్వారా సంపూర్ణ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఆయుష్మాన్ ఆరోగ్య శిబిరాల నిర్వహణ, డిజిటల్ ఎక్స్-రే, ఏఐ మద్దతుతో మొబైల్ మెడికల్ యూనిట్లు/నిక్షయ్ వాహనాలను మోహరించడం. మురికివాడలు, వలసదారుల సమూహాలు, నిర్మాణ స్థలాలు, పారిశ్రామిక ప్రాంతాలు, జైళ్లు, హాస్టళ్లు, ఆశ్రయాలు వంటి సామూహిక ప్రదేశాలలో స్క్రీనింగ్, నాట్ పరీక్ష, పోర్టబుల్ డిజిటల్ ఎక్స్ రే,  నిక్షయ్ ద్వారా మెరుగైన  రవాణా, రిపోర్టింగ్ ద్వారా రోగ నిర్ధారణను బలోపేతం చేయడం, క్షయ నివారణ చికిత్స అందించడం, నిక్షయ పోషణ యోజన కింద పోషకాహార మద్దతు, నిక్షయ మిత్ర ద్వారా సామాజిక మద్దతు కల్పించాలని, దీనికొరకై  పంచాయతీ రాజ్ సంస్థలు, పట్టణ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, స్వయం సహాయక బృందాలు భాగస్వామ్యంతో  అవగాహన కార్యక్రమాలను  సమాజం లోనికి తీసుకెళ్ల వల్సిన అవ్యశ్యకత ఎంతో వుంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం డాక్టర్ అర్జున్, కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్ గోవర్ధన్, టి.బి ప్రోగ్రాం మేనేజర్ నీలిమ శ్వేత, అశోక్, శ్రీనివాస్, అక్బర్, భాస్కర్, సందీప్, రాకేశ్, శ్రీదర్, ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.