29 June, 2026 | 1:25 AM

అన్నదాతలకు అండగా ‘ప్రజాప్రభుత్వం’

29-06-2026 12:28 AM
  1. 30న చింతకానిలో సీఎం రేవంత్‌రెడ్డి‘రైతు ఆశీర్వాద సభ’
  2. రైతులకు సంకెళ్లు వేసిన నాటి పాలకులా నేడు మొసలి కన్నీరు కార్చేది?
  3. భారీ వర్షాలొచ్చినా సభ విజయవంతం కావడం ఖాయం
  4. ఏర్పాట్ల పరిశీలన అనంతరం మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

చింతకాని, ఖమ్మం, జూన్ 28(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సాహసోపేత నిర్ణయాలతో అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో ఈనెల 30వ తేదీ మంగళవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్న ‘రైతు ఆశీర్వాద సభ’ ఏర్పాట్లను ఆదివారం ఆయన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల భారీ బలగంతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ స్థలాలను అంగుళం అంగుళం వీక్షించి, వాతావరణ మార్పులను తట్టుకునేలా జర్మన్ హ్యాంగర్లతో అద్భుతమైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి ..

అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భారీ వర్షాల సూచనలు ఉన్నప్పటికీ, ఏ విపత్తు ఎదురైనా ఈ సభ అనుకున్న దానికంటే డబుల్, త్రిబుల్ సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

గత రెండున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను అక్షరాలా నిలబెట్టుకుంటూ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో క్యాబినెట్ సాహసోపేత నిర్ణయం తీసుకుని, వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం మానవీయ కోణంలో కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. కేవలం కొనడమే కాకుండా, కొన్న వారం రోజుల లోపలే రైతుల అకౌంట్లలో పైసలు వేసిన నిఖ్సాన రైతు పక్షపాత ప్రభుత్వం ఇది అని కొనియాడారు.

రైతు ద్రోహులే నేడు కపట ప్రేమికులు!

గత పదేళ్ల పాలకుల తీరుపై మంత్రి పొంగులేటి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కేంద్ర, రాష్ట్రాల్లో గతంలో అధికారంలో ఉన్నవాళ్లు నేడు ఈ ప్రభుత్వంపై అనవసరంగా అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ప్రజలు తమ వైపు చూడటం లేదనే తీవ్ర ఫ్రస్ట్రేషన్లోనే వాళ్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘ఇదే ఖమ్మం పట్టణంలో గతంలో వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు, రైతుల కష్టాలు పట్టించుకోకుండా, నడిరోడ్డుపై అన్నదాతలకు సంకెళ్లు వేసి జైలుకు పంపించిన దుర్మార్గాన్ని ఈ జిల్లా ప్రజలు ఎన్నటికీ మరవరు.

నాడు రైతులను విస్మరించి, హింసించిన వాళ్లే.. నేడు ముసలి కన్నీరు కారుస్తూ కపట ప్రేమ ఒలకబోస్తున్నారు. ఈ రాజకీయ డ్రామాలను రైతులందరూ గమనిస్తూనే ఉన్నారు‘ అని హెచ్చరించారు. జిల్లా సీనియర్ నేత, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యేలందరినీ కలుపుకుని ఈ సభను ఒక చారిత్రాత్మక విజయంగా మలుస్తామన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో రికార్డు స్థాయి ప్రగతి

ఈ ప్రభుత్వం పేద ప్రజలందరికీ అండగా ఉండే ఇందిరమ్మ రాజ్యమని సభ ఏర్పాట్ల పరిశీలనలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు. కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 72,000 ఉద్యోగాలు ఇచ్చామని, రాబోయే రోజుల్లో మరిన్ని వేలాది నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సాగుతున్నాయన్నారు. ఇండ్ల నిర్మాణంలో ఒక్క రూపాయి లంచం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నిధులు జమ చేస్తున్నామని, రూరల్ ప్రాంతాలకు 2.5 లక్షలు, అర్బన్ కు లక్ష ఇండ్లను మంజూరు చేసినట్లు తెలిపారు.

అసంపూర్తిగా ఉన్న కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామని, రహదారుల అభివృద్ధి కోసం రూ. 22,000 కోట్లను సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేయడం విశేషమని తెలిపారు. ఈ ఏర్పాట్ల పరిశీలనలో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, మట్టా రాగమయి దయానంద్, రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, తోట దేవీ ప్రసన్న, వ్యవసాయ శాఖ కార్యదర్శి కే. సురేంద్ర మోహన్, కమిషనర్ గోపి, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సీపీ సునీల్ దత్  పాల్గొన్నారు.