భారీ విజయమే లక్ష్యం
ఆరంభంలో వరుసగా రెండు విజయాలతో ఫుల్ జోష్... మూడో మ్యాచ్‌లో సఫారీలపై ఊహించని ఓటమి.. ఫలితంగా సెమీస్ అవకాశాలకు పెద్ద ఎదురుదెబ్బ...ఇదీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు పరిస్థితి. ఇప్పుడు సెమీఫైనల్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలవాల్సి ఉంది. బంగ్లాపై భారీ రన్‌రేట్ సాధించడమే లక్ష్యంగా భారత మహిళల జట్టు బరిలోకి దిగుతోంది.
- బంగ్లాదేశ్‌తో భారత్ కీలక పోరు
- మహిళల టీ20 ప్రపంచకప్
- సెమీస్ రేసులో వెనుకబడ్డ భారత్
మాంచెస్టర్, జూన్ 24 : మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. మాంచెస్టర్ వేదికగా గురువారం బంగ్లాదేశ్‌తో తలపడబోతోంది. సెమీఫైనల్ చేరేందుకు ఈ మ్యాచ్‌లో భారీ విజయం భారత్‌కు కీలకంగా మారింది. ఎందుకంటే ప్రస్తుత వరల్డ్‌కప్ నిబంధనల ప్రకారం ఒక్కో గ్రూప్ నుంచి రెండు జట్లు మాత్రమే ముం దంజ వేస్తాయి. అందుకే ప్రతీ మ్యాచ్‌లో గెలుపు చాలా అవసరం. ఆరంభంలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లను చిత్తు చేసిన భారత మహిళల జట్టు మూడో మ్యాచ్‌లో ఓడిపోయింది.
ఆ ఒక్క ఓటమి టీమిండియా సెమీస్ అవకాశాలను దెబ్బతీసింది. ఇదే గ్రూపులో ఆస్ట్రేలియా నాలుగుకు నాలుగింటిలోనూ విజయాలు అందుకుంది. తద్వారా సెమీస్ బెర్తును దాదాపు ఖా యం చేసుకుంది. అటు భారత్. సౌతాఫ్రికా జట్లు కూడా రెండేసి విజయాలతో సమానంగా ఉన్నాయి. అయితే రన్‌రేట్ ప రంగా టీమిండియాదే పైచేయిగా ఉంది. దీంతో సౌతాఫ్రికా, భారత్ మధ్య మరో సెమీస్ బెర్తు కోసం పోటీ నెలకొంది. భారత్ ఇంకా బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాపై ఆడాల్సి ఉంది.
ఈ రెండూ గెలిస్తే ఎలాంటి టెన్షన్ లేకుండా సెమీస్‌కు చేరుకోవచ్చు. ఒక్కటి ఓడినా.. నెట్ రన్‌రేట్ కీలకమవుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పుడు బంగ్లాపై భారీ విజయం సాధించాల్సిందే. బ్యాటింగ్ పరంగా ప్రస్తుతం జట్టులో షెఫాలీ , స్మృతి వీరిద్దరిపైనా ఎక్కువగా భారత్ ఆధారపడుతోంది. ఆఖర్లో రిచా ఘోష్ దూకుడుతో మెరుపులు మెరిపిస్తోంది. అయితే మిడి లార్డర్ వైఫల్యం భారత్‌కు ఇబ్బందిగా మారింది. జెమీమా కూడా బ్యాట్‌కు పనిచెప్పాల్సిందే.
అటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కూడా భారీ ఇ న్నింగ్స్ బాకీ ఉంది.మరోవైపు బౌలింగ్‌లో స్పిన్నర్లు రాణిస్తున్నా పేసర్లు నిరాశ పరుస్తున్నారు. స్పిన్నర్ల ప్రదర్శనతోనే తొలి రెండు మ్యాచ్‌లలోనూ విజయాలు నమోదు చేసింది. టీ20 ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ ర్యాంకుకు చేరిన తెలుగు అమ్మాయి శ్రీ చరణి మూడు మ్యాచుల్లోనూ అదరగొట్టిం ది. మొత్తం 10 వికెట్లు పడగొట్టడం ద్వారా ఈ వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీచరణి టాపర్ గా ఉంది.
దీప్తి శర్మ ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన మినహా.. మిగతా రెండింట్లో ప్రభావం చూపించలేదు. పేసర్లు కూడా రాణించడం లేదు. శ్రీచరణికి తోడు దీప్తి శర్మ, మరో పేసర్ రాణిస్తే భారత్ బంగ్లాపై భారీ విజయాన్ని అందుకోవచ్చు. అలాగే భారత ఫీల్డింగ్ మెరుగుపడాలి. ఫీల్డింగ్‌లోనూ గొప్ప ప్రదర్శన చూపించకపోవ డం విమర్శలకు దారితీసింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో కాప్ ఇచ్చిన క్యాచ్‌ను జారవి డవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. తదుపరి మ్యాచ్‌లో ఫీల్డింగ్ మెరువకుంచే ఇబ్బందులు తప్పవు.
పిచ్ రిపోర్ట్
మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న మాంచెస్టర్ ఓల్డ్‌ట్రాఫోర్డ్ పిచ్ బ్యాలెన్సింగ్‌గా ఉంటుంది. బ్యాట్‌కూ, బాల్‌కూ సమనంగా అనుకూలిస్తుంది. ఎక్కువ శాతం బ్యాటింగ్‌కు సహకరి స్తుందని అంచనా వేస్తున్నారు.
తుది జట్ల అంచనా
భారత్ : స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తిక భాటియా, జెమీమా, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రిఛా ఘోష్, దీప్తి శర్మ, ప్రేమా రావత్, అరుంధతి, శ్రీచరణి, నందిని శర్మ
బంగ్లాదేశ్ : ఫెర్డౌస్, దలారా అక్తర్, షర్మీ న్ అక్తర్, నిగర్ సుల్తానా (కెప్టెన్), శోభన, శోర్న, రితూ మోని, నబీ దా అక్తర్, రుబేయా, షాన్‌జిడా, మౌరు ఫా అక్తర్






