20 August, 2026 | 3:17 AM

సాంకేతిక విద్యను నిర్వీర్యం చేసే ఆలోచన మానుకోవాలి

20-08-2026 12:00 AM

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం ప్రతిపాదన సరి కాదు 

జీవో నం.97ను రద్దు చేసి శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

ఏఐఎస్‌ఎఫ్ కలెక్టరేట్ ముట్టడి విజయవంతం

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 19 (విజయక్రాంతి): సాంకేతిక విద్యాశాఖను నిర్వీర్యం చేసే నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ కె షాహిద్,వరక అజిత్ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని కోరారు.

బుధవారం జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించి ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో నం.97ను రద్దు చేయడంతో పాటు, విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.సాంకేతిక విద్యను బలోపేతం చేసి, విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థులు ఈసెట్ ప్రవేశ పరీక్ష రాసే అర్హత కోల్పోయి, కార్పొరేట్ కంపెనీల్లో తక్కువ వేతనాలకే పనిచేసే పరిస్థితులు దాపురిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. డిప్లొమా విద్యార్థులకు ఎంతో కాలంగా అమల్లో ఉన్న లాటరల్ ఎంట్రీ విధానాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. 1957 నుంచి ఎంతో మంది సాంకేతిక నిపుణులను తీర్చిదిద్దిన పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను కాపాడుకునేందుకు పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ కార్యాలయంలోని పరిపాలన అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మాణిక్యాల వినయ్ జిల్లా ఉపాధ్యక్షులు కొరిమి సంజయ్ జిల్లా సమితి సభ్యులు ఉమామహేశ్వర్ రాజు కమల్ షబ్బీర్  నాయకులు కోమలి మానస మన్విత  శ్రీజ పాల్గొన్నారు.