20 August, 2026 | 2:45 AM

ఆకాశమే హద్దుగా జెన్ జీ!

20-08-2026 02:13 AM

మూలాలతో మమేకమై..

మన మట్టి పరిమళాలను పరిచయం చేయాలి

రేపటి భారతదేశాన్ని రచించేది యువతే

సునీల్ బన్సల్ మనసులో మాట

ప్రతి తరం తనదైనశైలిలో ప్రశ్నిస్తుంది. యువత అంటేనే ప్రశ్నించడం. అది ‘ఎందు కు’ అని అడుగుతుంది. విషయాలు ఎందుకు ఇలాగే ఉండాలో తెలుసుకోవాలనుకుంటుంది. కొన్నిసార్లు ధైర్యంగా మార్పు అవసరమని ప్రకటిస్తుంది. ఆ ప్రశ్నలు తరచుగా పాత తరానికి అసౌకర్యాన్ని కలిగి స్తాయి. నిన్న మన ప్రశ్నలు మన పెద్దలను ఇబ్బంది పెట్టాయి. నేడు మన పిల్లల ప్రశ్నలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. రేపు అదే పిల్లలు రాబోయే తరంపై ఇలాంటి ఫిర్యాదులే చేసే అవకాశం ఉంది. దీనినే మనం ‘తరాల మధ్య వ్యత్యాసం’ అంటాం. తరాల మధ్య తేడా అనేది ప్రకృతి నియమం. అయితే మనసుల మధ్య దూరం మాత్రం మనం సృష్టించుకునేదే. 

* వారికి మనం మన మూలాల వైపు దారి చూపించగలం. వారు మనకు కొత్త అవకాశాల వైపు దారి చూపించగలరు. మనం అనుభవపు వెలుగును అందించగలం. వారు మనకు అవకాశాల కొత్త సూర్యుడిని చూపించగలరు. ఈ సంబంధం ఉపన్యాసాలుగా కాకుండా సంభాషణలా ఉండాలి. ఆధిపత్యం కాకుండా భాగస్వామ్యంగా ఉండాలి. ఘర్షణ కాకుండా నమ్మకానికి సంబంధించినదిగా ఉండాలి. అదే తరాల మధ్య అత్యుత్తమ వారధి. కాబట్టి తదుపరిసారి ఎవరైనా సమావేశంలో నవ్వి.. అరె, ఈ జెన్ జీ వాళ్ళు.. అని అన్నప్పుడు, మనం కూడా ఎదురు నవ్వి.. అవును, వారు జెన్ జీ. కానీ వారు ఈ జనాలు కారు. వారు మన స్వంత పిల్లలు. వారు మన మిత్రులు. వారు మన ఆశ. వారు మన వర్తమానం. వారు మన రేపటి నిర్మాతలు అని చెప్పాలి.

* ప్రధానమంత్రి యువతను ఉద్దేశించి ‘నా యువ మిత్రులారా’ అని సంబోధించినప్పుడు, ఆ పదంలో కేవలం మర్యాద మాత్రమే కాదు, అంతకుమించిన భావం ఉంటుంది. అది యువతను మనకు ఎదురుగా కాకుండా, మన పక్కన నిలబెట్టే ఒక దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. కేవలం ఉపన్యాసాలు వినేవారిగా కాకుండా, సంభాషణలో భాగస్వాములుగా చూపిస్తుంది. పర్యావరణం, జంతువులు, పక్షుల హక్కులు, మానసిక ఆరోగ్యం, సమాన అవకాశాలు, బలహీనులకు అండగా నిలబడటం వంటి అంశాలపై నేటి యువత మరింత సులభంగా మాట్లాడతారు. వారి అంతిమ నిర్ణయాలు కొన్ని మనకు అపరిపక్వంగా అనిపించవచ్చు. కొన్ని ఆలోచనలతో మనం విభేదించవచ్చు. విభేదించడం సహజం. సానుభూతిని మా త్రం కొట్టిపారేయలేం. సరైన దిశను ఇస్తే, ఆ సానుభూతి దయగా మారుతుంది. దయ బాధ్యతగా మారుతుంది. బాధ్యత సమాజాన్ని మార్చే శక్తిగా మారుతుంది.

ఇటీవల జరిగిన ఒక సమావేశంలో కొత్త తరంపై చర్చ మొదలయ్యింది. రకరకాల అనుభవాలు బయటపడ్డాయి, ఆందోళనలు వెల్లువెత్తాయి, ఒకదాని తర్వాత ఒకటి ఫిర్యాదుల పరంపర కొనసాగింది. కొందరు మొబైల్ ఫోన్లను నిందించారు. మరికొందరు సోషల్ మీడియా వైపు వేలెత్తిచూపారు. ఇంకొందరు మారుతున్న విలువలు, క్షీణిస్తున్న సంప్రదాయాల గురించి మాట్లా డారు. ఈ చర్చ జరుగుతుండగానే, ఒక పెద్దమనిషి చిరు నవ్వుతూ చాలా తేలికగా.. ఆరే, ఈ జెన్ జీ వాళ్ళు ఉన్నారే అని వ్యాఖ్యానించారు. ఆ మాటలు చాలా సాధారణంగా, బహుశా సరదాగా అన్నవే కావచ్చు. అయినప్పటికీ, ఆ పదం మాత్రం మనసులోనే ఉండిపోయింది.

ఈ జెన్ జీ వాళ్ళు.. ఆ చిన్న పదం ఈ అనేది లోతుగా ఏదో అసంతృప్తిని, అలజడిని కలిగించింది. మనకు, మన పిల్లలకు మధ్య ‘ఈ’ దూరం ఎప్పుడు ఏర్పడింది? ఏ పిల్లల తొలి అడుగులకైతే మనం దారి చూపించామో, ఎవరి తొలి చిరునవ్వులైతే మన ఇళ్లను వెలిగించాయో, ఎవరి కలల్లోనైతే మనం మన భవిష్యత్తును పెట్టుబడిగా పెట్టామో.. ఎవరినైతే మనం దేశం యొక్క ఆశ, శక్తి, ప్రతిభ అని పదే పదే పిలిచామో..వారు అకస్మాత్తుగా ఈ జెన్ జీ వాళ్ళుగా ఎలా మారిపోయారు?

ప్రధానమంత్రి యువతను ఉద్దేశించి ‘నా యువ మిత్రులారా’ అని సంబోధించారు. ఆ పదంలో కేవలం మర్యాద మాత్రమే కాదు, అంతకుమించిన భావం ఉంది. అది యువతను మనకు ఎదురుగా కాకుండా, మన పక్కన కూర్చో బెట్టడం. వారికి ఉపదేశాలు చేయడం కాదు.. మన సంభాషణల్లో భాగస్వాములుగా చూడటం. బహుశా జెన్ జీ విష యంలో మనకున్న అతిపెద్ద గందరగోళం జెన్ జీ గురించి కాదు. వారిని చూడటానికి మనం ఎంచుకునే కోణం, దృక్పథమే అసలు కారణం. ప్రతి కొత్త తరం తన కాలాన్ని ప్రశ్నిస్తుంది.

ప్రశ్నించడమే యువత నైజం. భగత్ సింగ్ కూడా స్వాతంత్య్రాన్ని తన జీవితంలో అత్యున్నత లక్ష్యంగా భావించి బయలుదేరినప్పుడు ఆయన తన కాలానికి చెందిన ఒక యువకుడు మాత్రమే. ఆ కాలం వేరు, పోరాటం వేరు, మార్గాలు పరిమితం. కానీ లోపల రగిలే జ్వాల మాత్రం ఒక్కటే.. ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించ కూడదనే తపన.

ప్రతి తరం తనదైనశైలిలో ప్రశ్నిస్తుంది. యువత అంటేనే ప్రశ్నించడం. అది ‘ఎందుకు’ అని అడుగుతుంది. విషయాలు ఎందుకు ఇలాగే ఉండాలో తెలుసుకోవాలనుకుంటుంది. కొన్నిసార్లు ధైర్యంగా మార్పు అవసరమని ప్రకటిస్తుంది. ఆ ప్రశ్నలు తరచుగా పాత తరానికి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. నిన్న మన ప్రశ్నలు మన పెద్దలను ఇబ్బంది పెట్టాయి. నేడు మన పిల్లల ప్రశ్నలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. రేపు అదే పిల్లలు రాబోయే తరంపై ఇలాంటి ఫిర్యాదులే చేసే అవకాశం ఉంది. దీనినే మనం ‘తరాల మధ్య వ్యత్యాసం’ (జనరేషన్ గ్యాప్) అంటాం. తరాల మధ్య తేడా అనేది ప్రకృతి నియమం. అయితే మనసుల మధ్య దూరం మాత్రం మనం సృష్టించుకునేదే. 

మన మట్టి పరిమళాలను పరిచయం చేశామా..

అభిప్రాయాలు వేరు కావచ్చు. భాష మారవచ్చు. జీవిత వేగం పెరగవచ్చు. అయినప్పటికీ.. సంభాషణ అనేది కొనసాగితే.. అందమైన, సుహృద్భావ వాతావరణం ఏర్పడు తుంది. తరాల మధ్య ఉన్న ఆ దూరం ఒక పెద్ద లోయలా కాకుండా ఒక వారధిలా మారుతుంది. మన సర్వ సాధారణంగా చేసే ఫిర్యాదు ఏమిటంటే.. యువత ఎల్లప్పుడూ తమ ఫోన్లకే అతుక్కుపోతున్నారని. ఈ ఆందోళన పూర్తిగా ఆధారం లేనిది కాదు. కానీ ఈ ప్రశ్నలో కొంతభాగం తిరిగి మన వైపే చూపిస్తుంది.

మన పిల్లలు మన చేతుల్లో పుస్తకాలను చూస్తున్నారా? కుటుంబంలో మనం ప్రశాంతంగా మాట్లాడుకోవ డాన్ని వారు గమనిస్తున్నారా? భోజనం చేసేటప్పుడు కూడా మన మొబైల్‌ను దూరంగా ఉంచుతున్నామా? అనే ప్రశ్నలతోపాటు.. వారిని గ్రామాల్లోని మట్టి దారుల్లోకి తీసుకె ళ్లామా? పొలం గట్లపై నడిపించామా? మట్టి వాసనను పరిచయం చేశామా? తాతముత్తాతల జ్ఞాపకా ల్లో భద్రపరిచిన కుటుంబ కథలను పంచుకున్నా మా? మన మాతృభాష తీపిని వారి హృదయా ల్లో నాటడానికి ప్రయత్నించామా?

పిల్లల ప్రపంచం స్క్రీన్‌లోనే కుచించుకుపోతుంటే.. స్క్రీన్‌కు వెలుపల ఉన్న ప్రపంచాన్ని మనం ఎంత అందంగా చూపించామో మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. విలువలు కేవలం ప్రబోధించేవి కావు. అవి ఆచరించి చూపించేవి. మన మాటల కంటే మన ప్రవర్తన నుంచే పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు. యువతపై ఫిర్యాదు చేయడం సులభం. వారి ముందు ఒక ఆదర్శంగా నిలబడటం కష్టం.

ప్రపంచం ఆరచేతిలోకి వచ్చింది. సుదూర ప్రాం తాల్లో జరిగే వార్తలు మరుసటి రోజు వార్తాపత్రికతో మాత్రమే మనకు చేరే రోజులు ఒకప్పుడు ఉండేవి. నిరీక్షణ జీవితంలో ఒక భాగంగా ఉండేది. నేడు ప్రపంచం గుప్పెట్లోకి వచ్చేసింది. అంటార్కిటిక్ మంచుపై నడిచే ఒంటరి పెంగ్విన్ ఒక చిన్నారి స్క్రీన్‌పై క్షణాల్లో ప్రత్యక్షమవుతుంది. అలాగే విదేశీ విశ్వవిద్యాలయం ఉపన్యాసం, కాశీలో గంగా హార తి, బృందావనంలో సత్సంగం, చంద్రయాన్ ప్రయోగం అన్నీ క్షణాల్లో కండ్ల ముందు ప్రత్యక్షమవుతున్నాయి. 

ప్రపంచం ఓ టచ్..

మన తరం దృష్టిలో ప్రపంచం ఒక పటం. ఈ తరానికి అదొక స్పర్శ (టచ్). అందుకే వారి జిజ్ఞాస ఎక్కువగా ఉంది. వారి అవకాశాలు విస్తృతంగా, పెద్దవిగా ఉన్నాయి.. అలాగే వారి గందరగోళం, అయోమయం కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రపం చం చిన్నదిగా మారడంతో.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం బాధ్యత పెరిగింది. సమాచారపు ఈ మహాసముద్రంలో మనం వారికి ఒక తీరంగా మారాలి. ఆ తీరం పేరు ‘నమ్మకం’. నేటి యువత మతం, ఆధ్యాత్మికత, సంప్రదాయం, విలువల నుండి దూరమయ్యారని తరచుగా నిందిస్తుంటాం.

కానీ ఈ చిత్రానికి ఉన్న మరో కోణాన్ని కూడా చూడండి. ప్రేమానంద్ జీ మహారాజ్ మాటలను వినే లక్షలాది మంది యువకులను మనం ఎలా పరిగణించాలి? ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయంలో ప్రతి మంగళవారం గుమిగూడే యు వత ఎవరు? పుణ్యక్షేత్రా లు, ఆధ్యాత్మిక సమావేశాలలో యువకుల భాగస్వామ్యం పెరుగుతుండటం మనకు ఏమి చెబుతోంది?  ఈ తరం తన మూలాల నుంచి తనను తాను వేరు చేసుకోవడం లేదు.

అది తన మూలాల్లోకి తిరిగి వెళ్లడానికి తనదైన మార్గాన్ని వెతుక్కుంటోంది. దాని పద్ధతి వేరు, దాని భాష వేరు, దాని జిజ్ఞాస వేరు. ఇది శతాబ్దాలుగా ఇలాగే ఇలాగే జరుగుతోంది.. అని చెప్పినంత మాత్రాన ప్రతి విషయాన్ని వారు అంగీకరించరు. ‘ఎందుకు’ అని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నకు మనం భయపడాల్సిన అవసరం లేదు. సంప్రదా యం వెనుక ఉన్న తత్వాన్ని, విశ్వాసం వెనుక ఉన్న సారాంశాన్ని మనం వివరించాలి. ఆచరణ ద్వారా సంస్కృతిని నిరూపించాలి.

మూలాలతో అనుబంధం అనేది ఆత్మీయతతో నిర్మించబడుతుంది తప్ప.. ఆదేశాలతో కాదు. జెన్ జీ కొన్ని సెకన్ల రీల్స్‌కే పరిమితం చేయడం వారి విశాలమైన వ్యక్తిత్వానికి అన్యాయం చేయడమే అవుతుంది. సరిహద్దుల్లో నిలబడేది కూడా ఇదే తరం. ఈ యువకులు యూనిఫాంలు ధరించి దేశం కోసం అత్యున్నత త్యాగానికి సిద్ధమవుతున్నారు.

ఈ తరం చదరంగం బల్లపై ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. డీ గుకేష్ వంటి ఆటగాళ్లు భారతీ య ప్రతిభకు కొత్త పరిచయం రాస్తున్నారు. ఈ యువకులు స్టార్టప్‌లను నిర్మిస్తున్నారు. ప్రయోగశాలల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. క్రీడా ప్రాంగణాల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేస్తున్నారు. సాంకేతికత, విజ్ఞాన శాస్త్రం, పారిశ్రామిక రంగాలలో కొత్త మార్గాలను తెరుస్తున్నారు. వారు రీల్స్ తయారుచేస్తారు. అలాగే రికార్డులను కూడా సృష్టిస్తారు.

వారి వేళ్ళు స్క్రీన్లపై కదులుతుంటాయి. ఆ వేళ్లే చరిత్ర సృష్టించే చెస్ పావుల ను కదుపుతాయి. కీబోర్డులపై కొత్త సాంకేతికతను రూపొందిస్తాయి. జాతీయ జెండాను పట్టుకుంటాయి. వ్యక్తీకరణ మారింది. ఆకాంక్ష మారలేదు. ఈ తరం యొక్క ఉత్తమగుణాలలో ఒకటి సానుభూతి. ఇది తన స్వంత బాధను మాత్రమే కాకుండా ఇతరుల బాధను కూడా గుర్తించడానికి ప్రయత్నిస్తుంది.

పర్యావరణం, జంతువులు, పక్షుల హక్కులు, మానసిక ఆరోగ్యం, సమాన అవకాశాలు లేదా బలహీనులకు అండగా నిలబడటం వంటి అంశాలపై నేటి యువత మరింత సులభంగా మాట్లాడతారు. వారి  కొన్ని నిర్ణయాలు మనకు అపరిపక్వంగా అనిపించవచ్చు. కొన్ని ఆలోచనలతో మనం విభేదించవచ్చు. విభేదించడం సహజం. కానీ సున్నితత్వాన్ని మాత్రం కొట్టిపారేయలేము. సరైన దిశను ఇస్తే.. ఆ సానుభూతి కరుణగా మారుతుంది. దయ బాధ్యతగా మారుతుంది.

బాధ్యత సమాజాన్ని మార్చే శక్తిగా మారుతుంది. మెరిసే ప్రతి స్క్రీన్ వెనుక ఒక మనస్సు ఉంటుంది. నేటి యువతకు అవకాశాల ఆకాశం ఉంది. కానీ ఒత్తిళ్ళు కూడా తక్కువేమీ కావు. పోలికలు నిరంతరం ఉంటూనే ఉంటాయి. ప్రతి మలుపులోనూ పోటీ ఉంటుంది. ప్రతి స్క్రీన్‌పై మరొకరి విజయం మెరుస్తుంటుంది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ విజేతలుగా కనిపిస్తారు. కాబట్టి ఒక చిన్న వ్యక్తిగత ఎదురుదెబ్బ కూడా కొండంత పెద్దదిగా అనిపించవచ్చు.

అందుకే నేటి పిల్లలకు కేవలం క్రమశిక్ష ణ మాత్రమే అవసరం లేదు. వారికి భరోసా కావాలి. ఎప్పుడూ మా రోజుల్లో అయితే అని ప్రారంభించాల్సిన అవస రం లేదు. కొన్నిసార్లు వారి పక్కన కూర్చుని, చెప్పు నేను వింటున్నా.. అని చెప్పడం మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఆ చిన్న వాక్యం ఒంటరిగా భావించే మనస్సుకు ఒక పెద్ద ఆకాశంగా మారవచ్చు. జెన్ జీకి అందించడానికి మన దగ్గర చాలా ఉంది. మన అనుభవం, మన జ్ఞాపకాలు, మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన పోరాటా ల ద్వారా పొందిన జ్ఞానం. అయితే ఈ తరం కూడా మనకు ఇవ్వడానికి చాలా ఉంది. ఒక కొత్త దృక్పథం, కొత్త వేగం, కొత్త సాంకేతికత, కొత్త ప్రశ్నలు, ప్రపంచాన్ని చూడటానికి ఒక విభిన్నమైన కిటికీ. మనం వారికి సహనాన్ని ఇవ్వగలం.. వారు మనకు వేగాన్ని ఇవ్వగలరు.

వారికి మనం మన మూలాల వైపు దారి చూపించగలం. వారు మనకు కొత్త అవకాశాల వైపు దారి చూపించగలరు. మనం అనుభవపు వెలుగును అందించగలం. వారు మనకు అవకాశాల కొత్త సూర్యుడిని చూపించగలరు. ఈ సంబంధం ఉపన్యాసాలుగా కాకుండా సంభాషణలా ఉండాలి. ఆధిపత్యం కాకుండా భాగస్వామ్యంగా ఉండాలి. ఘర్షణ కాకుండా నమ్మకానికి సంబంధించినదిగా ఉండాలి. అదే తరాల మధ్య అత్యుత్తమ వారధి. కాబట్టి తదుపరిసారి ఎవరైనా సమావేశంలో నవ్వి.. అరె, ఈ జెన్ జీ వాళ్ళు.. అని అన్నప్పుడు, మనం కూడా ఎదురు నవ్వి.. అవును, వారు జెన్ జీ. కానీ వారు ఈ జనాలు కారు. వారు మన స్వంత పిల్లలు. వారు మన మిత్రులు. వారు మన ఆశ. వారు మన వర్తమానం. వారు మన రేపటి నిర్మాతలు అని చెప్పాలి.

వారు చెప్పేదంతా సరైనది కాకపోవచ్చు.. మనం చెప్పినవన్నీ సరైనవి కానట్లే. మనం చేసినట్లే వారు కూడా పొరపాట్లు చేస్తారు. వారు కిందపడతారు, దెబ్బతింటారు, నేర్చుకుంటారు, మళ్లీ లేస్తారు. బహుశా మనకంటే ముందే వెళ్తారు. వారి దారిని మనం నిర్దేశించాల్సిన అవసరం లేదు. తమ దారిని వారు వెతుక్కునేటప్పుడు వారు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు.. ‘మనవాళ్ళు’ అని అనిపించేలా ఒక వ్యక్తి కనిపిస్తే చాలు. ఫిర్యాదుల కంటే ఎక్కువగా నమ్మకాన్ని కళ్ళల్లో నింపుకున్న ఒక వ్యక్తి కనిపిస్తే చాలు.

ఎందుకంటే.. జెన్ జీ అనేది మరొక ప్రపంచం కాదు. ఇది మన కథలోని తదుపరి అధ్యాయం. మనం మన వం తుగా భారతదేశాన్ని పొందాం. దాన్ని జీవిం చాం.. కాస్త మెరుగుపరిచాం. ఇప్పుడు భారతదేశం తదుపరి ప్రయాణం ఈ యువత భుజాలపై ముందుకు సాగుతుంది.

రేపటి భారతదేశం ఎలా ఉంటుందో.. దాని అక్షరాలు ఈ యువత కళ్లల్లోని కలలు రచిస్తా యి. దానికి రంగులు వారి ఊహల నుంచి వస్తాయి. దాని వేగాన్ని వారి అడుగులే నిర్ణయిస్తాయి. వారిని దోషులుగా, నిందితులుగా నిలబెట్టడం కంటే.. వారి పక్కన నిలబడండి. వారిపై ఫిర్యాదులు తగ్గించండి. ఎక్కువగా మాట్లాడండి. వారి మాట వినండి. వారిని అర్థం చేసుకోండి. అన్నింటికంటే మించి.. వారిని నమ్మండి. భవిష్యత్తు అనేది మన అచ్చులో పోసి తయారుచేయలేం. భవిష్యత్తు చేతిని పట్టుకోవాలి. దానితో కలిసి నడవాలి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి.. భారతదేశం తరువాత కథను రాయాల్సింది వారు తప్ప మరెవరో కాదు.!

సునీల్ బన్సల్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి