20 August, 2026 | 2:05 AM

రెండు చరణాలే!

20-08-2026 01:30 AM

వందేమాతరంపై 1937 తీర్మానానికే కాంగ్రెస్ జై

  1. ‘చాత్రోంకి గూన్జ్’ కార్యక్రమం 800 నగరాల్లో.. 
  2. డీలిమిటేషన్ వద్దు.. మహిళా రిజర్వేషన్లే  ముద్దు
  3. దేశ సమగ్రత, సమాఖ్య వ్యవస్థ, పార్లమెంటరీ ప్రాతినిధ్యంపై పలు కీలక తీర్మానాలు చేసిన సీడబ్ల్యూసీ

న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఢిల్లీలోని ఇందిరా భవన్ వేదికగా బుధవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశ సమగ్రత, సమాఖ్య వ్యవస్థ, పార్లమెంటరీ ప్రాతిని ధ్యంపై పలు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రధానంగా కేంద్ర ప్రభు త్వం ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియను సీడ బ్ల్యూసీ తీవ్రంగా వ్యతిరేకించింది.

లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచకుండా, ప్రస్తుతం ఉన్న 543 స్థానాల పరిమితిని అలాగే కొనసాగించాలని పార్టీ డిమాండ్ చేసింది. జాతీ య గేయం వందేమాతరంపై కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అంతర్గత సమావేశాలు, పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరం గీతంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని పునరుద్ఘాటించింది. 1937 నాటి పార్టీ తీర్మానానికి కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

వందేమాతరంలోని పూర్తి ఆరు చరణాలను ఆలపించాలని ఇటీవల కేంద్ర ప్రభు త్వం కొత్త మార్గదర్శకాలు జారీచేసిన నేపథ్యంలో సీడబ్ల్యూసీ తాజా తీర్మానం బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ పోరును మరింత పెంచనుంది. జనాభా ప్రాతిపదికన చేపట్టే డీలిమిటేషన్ వల్ల జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది.

మహిళా రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపెట్టడం సరికాదని, ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లోనే తక్షణమే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ స్పష్టం చేసింది. మరోవైపు సరిహద్దుల్లో చైనా దురాక్రమణలు, చొరబాట్ల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని సీడబ్ల్యూసీ తీవ్రంగా తప్పుబట్టింది. సరిహద్దుల్లోని వాస్తవ పరిస్థితులను దేశ ప్రజలకు వెల్లడించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తింది.

భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా చేస్తున్న కుట్రలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడి దేశానికి స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జాతీయ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని, ఈ అంశంపై పార్లమెంట్‌లో లోతైన చర్చ జరగాలని తీర్మానించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని, పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సీడబ్ల్యూసీ పిలుపునిచ్చింది.

అయోధ్య రామ మందిర విరాళాల్లో అవకతవకలు జరగడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని ఖర్గే చెప్పారు. ఇందుకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలన్నారు. దేశంలో కొత్తగా పాఠశాలను ప్రారంభించకుండా, ఉన్న పాఠశాలల్లో ౯౪ వేల స్కూళ్లను మోదీ సర్కార్ మూసివేసిందని తెలిపారు.

‘చాత్రోంకి గూన్జ్’ కార్యక్రమాన్ని 800 నగరాల్లో నిర్వహించాలని, తద్వారా విద్యార్థుల సమస్యలు మరియు విద్యా సంస్కరణలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ కృషిచేయాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు తెలిపారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతోపాటు సీడబ్ల్యూసీ సభ్యులు.. కేసీ వేణుగోపాల్, పీ చిదంబరం, వీరప్ప మొయిలీ, అంబికా సోనీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. 

అసలేం జరిగిందంటే?

అధికారిక ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరంలోని పూర్తి ఆరు చరణాలను ఆలపించాలని.. దానికి తగిన గౌరవ చట్టపరమైన రక్షణలు కల్పించాలని మోడీ సర్కార్ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే, 2026, ఆగస్ట్ 15న ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వందేమాతరం పూర్తి పాడకుండా.. కేవలం మొదటి రెండు చరణాలే మాత్రమే ఆలపించారు.

ఈ ఘటనపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నాయకత్వం జాతీయ గేయాన్ని గౌరవించడం లేదని ఆరోపించింది. ఈ క్రమంలో వందేమాతరం గేయంపై సీడబ్ల్యూసీ కీలక నిర్ణయం తీసుకుంది. 1937 నాటి సీడబ్ల్యూసీ తీర్మానం మేరకు పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని నిర్ణయించింది.

1937 సీడబ్ల్యూసీ తీర్మానం..

బంకిం చంద్ర ఛటర్జీ రాసిన వందేమాత రం గీతంలో మొత్తం ఆరు చరణాలు ఉన్నాయి. ఇందులో మొదటి రెండు చరణాలు కేవలం మాతృభూమి ప్రకృతి సౌందర్యాన్ని, విశిష్టతను వర్ణిస్తుండగా.. మిగిలిన చరణాల్లో కొన్ని చోట్ల మతపరమైన ప్రస్తావనలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో అన్నివర్గాల సెంటిమెంట్లను గౌరవిస్తూ మతపరమైన ప్రస్తావన ఉన్న వందేమాతరం చరణాలను ఆలపించకుండా.. కేవలం వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే పాడాలని 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చిన ఈ సలహాను మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, మౌలానా అబు ల్ కలాం ఆజాద్ తో కూడిన కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈ రెండు చరణాలను మాత్రమే ఆలపిస్తోంది.

పోలీసుల క్రూరత్వాన్ని ప్రశంసించాలా?

దిల్లీలోని జంతర్మంతర్ వద్ద విద్యార్థుల నిరసనల సమయంలో ఏ ఒక్కరికీ హాని జరగలేదని, వాస్తవానికి ఢిల్లీ పోలీసులను ప్రశంసించాలంటూ కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. దేశ విద్యార్థులతో అవాస్తవాలు చెప్పొద్దని.. వారికి కళ్లు, జ్ఞాపకశక్తి ఉన్నాయంటూ ’ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. ‘పార్లమెంటు సమీపంలో శాంతియుతంగా ఉన్న విద్యార్థులపై పెల్లెట్ గన్లతో కాల్పులు జరిపారు.

మేకులతో కూడిన లారీలతో కొట్టారు. ఈ క్రూరత్వాన్ని ప్రశంసించాలా? గాయపడిన విద్యార్థులను నేను స్వయంగా కలిశాను. ఏం జరిగిందో దేశమంతా చూసింది. ఇటీవల పార్లమెంటు సమావేశాల సమయంలో కేంద్రమంత్రి అమిత్ షా కనిపించలేదు. ప్రధాని ఇప్పటివరకూ విద్యార్థులకు క్షమాపణ చెప్పలేదు. వారు తమ తప్పులను అంగీకరించరు. దేశ యువతకు అబద్ధాలు చెప్పకండి. వారికి కళ్లతోపాటు జ్ఞాపకశక్తి కూడా ఉంది‘ అని రాహుల్ విమర్శించారు.