మంత్రి పొంగులేటి అవినీతిని నిరూపిస్తా
ఈడీ, సీబీఐ, లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం
బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హ యాంలో భారీ ఎత్తున అవినీతి, భూదందాలు జరుగుతున్నాయని, స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన క్షమాపణే ఇందుకు నిదర్శనమని బీజేపీ శాసనసభా పక్ష నేత (బీజేఎల్పీ) ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి అవినీతిపై ఈడీ, సీబీఐ, లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తామన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ సంస్థలకు, బీఆర్‌ఎస్ పార్టీకి బినామీగా ఉన్న ఫీనిక్స్ కంపెనీకి మధ్య భారీ క్విడ్ ప్రో కో జరిగిందని ఆరోపించారు.
మంత్రి అయిన తర్వాత నానక్‌రామ్‌గూడ, పుప్పాలగూడ, నార్సింగి, కోకాపేట్, హైటెక్ సిటీ ప్రాంతాల్లోని టీజీఐఐసీ ఇండస్ట్రియల్ భూములను రాత్రికి రాత్రే రెసిడెన్షియల్ జోన్లుగా మార్చి ఫీనిక్స్ కంపెనీ నుంచి సుమారు రూ.15 వేల కోట్ల విలువైన ఆస్తులను బదలాయించుకున్నారని ఏలేటి ఆరో పించారు. అవినీతిపై తాను పూర్తి ఆధారాలతో నిరూపిస్తానని, అంసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చర్చకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిద్ధమా అని సవాల్ విసిరారు.
బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... లక్షల కోట్ల రూపాయల విలువైన కోటి ఎకరాల భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టి బేరసారాలు నడుపుతున్నారని, ఇంత పెద్ద తప్పిదం చేసి కేవలం ’క్షమాపణ’తో సరిపెట్టుకోవాలని చూడటం సిగ్గుచేటన్నారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా యాదగిరిగుట్టలోని తన 42 ఎకరాల భూమి కూడా నిషేధిత జాబితాలోకి వెళ్లిందని, దీని వెనుక కుట్ర దాగి ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని చెప్పారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ భూదందాలు, నిషేధిత భూముల జాబితాపై శ్వేతపత్రం విడుదల చేయాలని, సమగ్ర విచారణ లేదా సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
రాహుల్‌కూ ఫిర్యాదు చేస్తాం
ఈ మొత్తం భూదందాలు, ఆస్తుల బదలాయింపులపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అన్ని ఆధారాలతో వేచి ఉంటానని, పొంగులేటి చర్చకు రావాలని హెచ్చరించారు. ఈ అవినీతికి సంబంధించి రాహుల్ గాంధీకి లేఖ రాస్తామని స్పష్టం చేశారు.






