calender_icon.png 13 February, 2026 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ చౌరస్తాలో అజ్జూ భాయ్!

13-02-2026 01:10:58 AM

  1. క్రికెట్‌లో దిగ్గజమైనా రాజకీయాల్లో రాణించడం లేదనే విమర్శ 
  2. అమాత్యుడిగానైనా అజారుద్దీన్‌ను అక్కున చేర్చుకోని మైనార్టీలు  
  3. మరో బలమైన మైనార్టీ నాయకుడిని ప్రోత్సహించాలని స్వపక్షంలో డిమాండ్

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): ముస్లిం మైనార్టీలు దేశవ్యాప్తంగా  కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి ఉండేది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్‌కు కొంత దూరమై.. బీఆర్‌ఎస్‌కు దగ్గరైన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి ముస్లిం మైనార్టీల మద్దతు కోసం పడరాని పాట్లు పడుతోంది.

అంతేకాకుండా ముస్లింల ఓటు బ్యాంక్‌ను పదిలం చేసుకునేందుకు అధికార పార్టీ నానా తంటాలు పడు తోంది. అందులో భాగంగానే క్రికెట్ దిగ్గజమైన అజారుద్దీన్‌కు జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు మంత్రి పదవిని కట్టబెట్టింది. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నా, రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అజారుద్దీన్‌కు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కూడా ఇచ్చారు. యూపీఏ హయాంలో ఉత్తరప్రదేశ్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రె స్ పార్టీ అవకాశం కల్పించింది.

ఇదంతా ఒక ఎత్తయితే.. అజారుద్దీన్ వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం కలగడం లేదని కాంగ్రెస్ క్యాడర్‌లో బలమైన వాదన వినిపిస్తోంది. అయితే ముస్లిం మైనార్టీ వర్గాల నుంచి బలమైన నాయకుడిని ప్రోత్సహించకుండా.. ఆ వర్గాల్లోనే సరైన ఆదరణలేని అజారుద్దీన్‌ను ఎంపిక చేయడమేంటి? అనే ప్రశ్నలు స్వపక్షంలోనే ఉత్పన్నమవుతున్నాయి.

జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు అజారుద్దీన్ మంత్రి ఇవ్వడం వల్ల కనీసం ఒక శాతం ప్రయోజనం కూడా కలగలేదని కాంగ్రె స్ క్యాడర్‌లో చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం మద్దతుతోపాటు  మంత్రు లు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణుల గల్లీ గల్లీని, ఇంటింటిని ఒడిసిపట్టడంతోనే విజయం లభించిందని భావిస్తున్నారు. 

ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మంత్రులకు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా కాంగ్రెస్ పార్టీ నియమించింది. అజారుద్దీన్‌కు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. కానీ అజారుద్దీన్ మున్సిపల్ ఎన్ని కల ప్రచారాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఒకసారి గాంధీభవన్‌లో జరిగిన సమావేశానికి హాజరుకాగా, మరొకసారి నియోజక వర్గంలో ప్రచారానికి వెళ్లారని చెబుతున్నారు. క్రికెట్‌లో రాణించిన అజారుద్దీన్.. రాజకీయాల్లో మాత్రం పూర్తిగా వెనకబడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్‌కు పదవులు కట్టబెడుతున్నా.. ఆయన వల్ల కాంగ్రెస్ పెద్దగా లాభపడింది లేదనే విమర్శలు ఉన్నాయి.

కనీసం మైనార్టీ ఓటు బ్యాంకును హస్తం పార్టీవైపు మళ్లించేందుకు ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదని, ఆయనకంటే ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన మరో బలమైన వ్యక్తికి పదవులు ఇస్తే ఎంతో కొంత పార్టీకి లాభం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఊగిసలాటలో ఎమ్మెల్సీ పదవి..

ప్రస్తుతం అజారుద్దీన్ ఏ చట్టసభల్లోనూ సభ్యుడిగా లేరు. మంత్రివర్గంలో ముస్లిం మైనార్టీలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అజారుద్దీన్‌ను అక్టోబర్‌లో తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. చట్టసభల్లో సభ్యుడిగా లేకున్నా.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలల్లోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది.

ఇప్పుడు అసెంబ్లీకి ఎన్నికలు లేనందున అజారుద్దీన్  మరో రెండున్నర నెలల్లో ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంది. ఒక వేళ ఎమ్మెల్సీగా అవకాశం రాకుంటే మంత్రి పదవికి రాజీనామా చేసి.. తిరిగి మరోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా ఎలా అవకాశం కల్పిస్తారనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది.

తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత రాజీనా మాతో ఖాళీ అయిన నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారా..? లేదంటే గవర్నర్ కోటాలో భర్తీ చేస్తారా..? అనేది ఆసక్తిగా మారిం ది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండింటిలో ఒక స్థానంలో కోదండరామ్‌ను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. రెండో స్థానంలో అజారుద్దీన్ పేరును ప్రతిపాదిస్తే..  క్రికె ట్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న అజారుద్దీన్ పేరును గవర్నర్ ఆమోదిస్తారా..? లేదా..? అనేది కూడా చర్చగా మారింది.

ఒకవేళ నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేయిస్తే.. ఇప్పుడు జరిగే మున్సిపాలిటీలు, వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలుచుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయ్యేవరకు వేచిచూడాలి. అప్పటివరకు అజారుద్దీన్ మంత్రి పదవికి ఆరు నెలల గడవు ముగుస్తుంది. దీంతో మంత్రి పదవికి రాజీనామా చేసి.. తిరిగి మరోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై మరో రెండు, మూడు నెలలు వేచి చూడాల్సిందే.