15 July, 2026 | 12:52 AM

అక్షర యోధుడా..అల్విదా!

09-06-2024 01:59 AM

అనారోగ్యంతో హైదరాబాద్‌లో తుది శ్వాస 

పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మేధావి

అడుగిడిన ప్రతి రంగంలో జయకేతనం

రాష్ట్రపతి, ప్రధాని, రేవంత్, కేసీఆర్ సంతాపం

నేడు రామోజీ ఫిలిం సిటీలో అంత్యక్రియలు

రామోజీ ఇకలేరు

అక్షరాన్ని ఆయుధంగా మలిచిన మేధావి.. పెన్నుతో ప్రభుత్వాల వెన్నులో వణుకు పుట్టించవచ్చని తెలిపిన అక్షర శిల్పి.. జర్నలిజం అంటే సామాన్యులకు కొమ్ముకాయటమేనని నమ్మిన జ్ఞానశీలి.. తెలుగు పత్రికారంగానికి కొత్త శక్తులు, యుక్తులు, రంగులద్ది పరుగులు పెట్టించిన మార్గదర్శి.. చలనచిత్రమనే కాన్వాస్‌పై అందమైన సినిమా బొమ్మలు ఆవిష్కరించిన ప్రజ్ఞాశాలి.. అన్నదాతకు హలమై, పుస్తకానికి నేస్తమై, సితారలకు నెలవై నిలిచిన దార్శనికుడు.. తెలుగు మీడియాపై తన పాదముద్రలను వదిలి నిష్క్రమించాడు.

ఈనాడు గ్రూప్ మీడియా సంస్థలతో తెలుగు మీడియా రంగాన్ని కొత్త దారులు పట్టించిన రామోజీరావు (88) అనారోగ్యంతో శనివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఆరో గ్యం శుక్రవారం రాత్రి మరింత క్షీణించటంతో నగరంలోని ఓ దవాఖానకు తరలించారు. చికిత్సపొందుతూ శనివారం తెల్లవాజు జామున 4:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలింసిటీలోని రామోజీ నివాసానికి తరలించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు రామోజీ ఫిలింసిటీలోని సత్యవనంలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.

పేద కుటుంబంలో పుట్టి భవిష్యత్తును దర్శించిన మేధావిగా అనేక రంగాల్లో తన ముద్రవేసిన రామోజీరావు.. తెలుగు ప్రజలకు సుపరిచితుడు. ముఖ్యంగా ఈనాడు మీడియా సంస్థలతో ప్రతి తెలుగు లోగిలోకి అడుగు పెట్టారు. ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

రామోజీరావు మృతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జనసేన అధినేత పవన్‌ల్యాణ్, ప్రముఖ సినీనటులు చిరంజీవి, రజినీకాంత్, కమల్‌హాసన్ తదితులు తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. రామోజీ ఫిలింసిటీలో రామోజీరావు పార్థివ దేహానికి రాజకీయ, సినీ ప్రముఖులు శనివారం నివాళులు అర్పించారు.

రామోజీ మృతిపై కాంగ్రెస్ నేతల సంతాపం.. 

రామోజీరావు మృతిపై పలువరు  కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పార్దీవదేహానికి నివాళులు అర్పిం చి, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. సంతాపం తెలిపిన వారి లో  పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, మాజీ మంత్రులు కుందూ రు జానారెడ్డి, మోత్కుపల్లి నరసింహులు,  మండవ వెంకటేశ్వరరావు,  టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ జగ్గారెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్, ఎంపీలు చామల కిరణ్‌కుమా ర్‌రెడ్డి, మల్లు రవి,  టీ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జి. నిరంజన్, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్, కడియం శ్రీహరి,  ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎమ్మెల్యేలు  ఉన్నారు.  

* రామోజీరావు స్వయం కృషితో కష్టపడి అనేక రంగాల్లో విజయం సాధించాడు. ఒక అఖండ తెలుగు జ్యోతి అరిపోయిందని, రామోజీరావు వ్యక్తికాదు శక్తిమంతమైన వ్యవస్థ, స్వయం కృషితో కష్టపడి అనేక రంగాల్లో విజయం సాధించారు. ఒక ధృవ తారలా నిరంతరం వెలుగుతూ ఉంటారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు భవిష్యత్తు తరాలకు ఆదర్శం.

 వెంకయ్యనాయుడు, మాజీ రాష్ట్రపతి.

* ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను గుర్తు చేశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని, కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన రామోజీరావు తెలుగు ప్రజల ఆస్తి అని, ఆయన మరణం రాష్ట్రానికే కాదు, దేశానికి తీరని లోటు.  

 చంద్రబాబునాయుడు, టీడీపీ అధినేత.

* సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో  ఉండటంతో ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో ప్రభుత్వం నిర్వహిస్తుంది. రామోజీరావు గొప్ప లౌకికవాద, తాత్విక వేత్త. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరికి ఉన్నప్పటికి ప్రజల పక్షాల నిలబడి ప్రతిపక్షంగా వ్యవహరించారు. ప్రభుత్వ తప్పిదాలను ఎప్పటికప్పుడు తన మీడియా ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన స్థాపించిన సంస్థల ద్వారా సామాజిక బాధ్యతలను నిర్వర్తించారు. రామోజీరావు సాధించిన విజయాలు ఆయనకే కాదు.. తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచాయి.

మల్లు భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం

* తెలుగు భాషను సుసంపన్నం చేసి తెలుగువారి గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన రామోజీరావు మృతి అందరికీ తెలుగువారికి తీరని లోటు. రామోజీరావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా.  తెలుగు సినీ రంగానికి మంచి గౌరవాన్ని తెచ్చిన రామోజీరావు నిష్క్రమణ బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న.

 చిన్న జీయర్‌స్వామి 

* రామోజీరావు మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. మీడియా, వ్యాపార రంగాల్లో రాణించి, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన మరణం పత్రికరంగానికి కొంచెం వెలితి ఏర్పడుతుంది. జీవితంలో ఎదగాలనుకునే వారికి రామోజీ జీవితం ఆదర్శప్రాయం. 

 గడ్డం ప్రసాద్‌కుమార్, అసెంబ్లీ స్పీకర్

* రామోజీరావు సాధారణంగా చనిపోలేదు. చిట్ ఫండ్ కేసుల పేరుతో హింసించి హత్య చేశారు. అలా చేయడం దారుణం. వైసీపీ చర్యలను తాను అనాడే వ్యతిరేకించా. జగన్ ప్రభుత్వం హింసించడం వల్లే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఇది ముమ్మాటికీ హత్యే.

వీ హనుమంతరావు,  పీసీసీ నేత

* మీడియా రంగంలో రామోజీరావు చెరగని ముద్ర వేశారు. జర్నలిజంలో నూతన ఒరవడికి బాటలు వేశారు. అనేక సంస్థలను స్థాపించి ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా వాటిని విజయాల బాటలో నడిపించడం ఆయన క్రమశిక్షణకు నిదర్శనం. ఆయన మరణం మీడియా రంగానికి తీరని లోటు.

 మధుయాష్కీగౌడ్, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ 

* రామోజీరావు బహుముఖ ప్రజ్ఙాశాలి. అనేక రంగాల్లో తన ప్రతిభను చాటుకున్న మహనీయుడు. ఆయన మరణం తెలుగు ప్రజానీకానికి తీరని లోటు. ఆత్మకు శాంతి కలగాలి.

 ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి.

* శ్రమపడితే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చనడానికి రామోజీరావు నిదర్శనం. ఉన్నత శిఖరాలకు ఎదిగిన రామోజీరావు ఆదర్శనీయుడు. వారి మరణం తీరనిలోటు. పత్రికా రంగానికి మార్గదర్శి. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి  ఆయన్ను దగ్గరగా చూశాను. వారి జీవితం ఆదర్శమైంది.

పొన్నం ప్రభాకర్, మంత్రి 

* రామోజీరావు జీవితం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం. ఆయన నడవడిక తెలుగు జాతికి మార్గదర్శకం. మీడియా రంగానికి ఆయన ఒక లెజెండ్.

 తుమ్మల నాగేశ్వర్‌రావు,  మంత్రి 

ప్రముఖుల నివాళి

* మీడియా రంగంలో రామోజీరావు సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు. రామోజీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆయన పాత్రికేయ, సినీ రంగంపై చెరగని ముద్ర వేశారు. 

               ప్రధాని మోదీ

* రామోజీ రావు మరణంతో మీడియా, వినోద రంగం ఓ టైటాన్‌ను కోల్పోయింది. ఆయన దూరదృష్టితో ఎన్నో విజయాలు సాధించి సమాజంలో చెరగని ముద్ర వేశారు. పద్మవిభూషన్ సత్కారం అందుకున్నారు. ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 

* రామోజీరావు మరణం విచారకరం. మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన దూరదృష్టి గల వ్యక్తి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.

మల్లికార్జున్ ఖర్గే

* మీడియా, చలనచిత్రాల రంగాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన మరణం మీడియా, సినీ రంగానికి తీరని లోటు. రామోజీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.

రాజ్‌నాథ్ సింగ్

* రామోజీ రావు అంటే క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ నూతన ఒరవడి సృష్టించారు. ఫిల్మ్‌సిటీ ద్వారా ప్రపంచానికి తెలుగు ఘనత చాటిచెప్పారు.

                వెంకయ్య నాయుడు

* రామోజీరావు నన్ను ఒకసారి ఫిల్మ్‌సిటీకి ఆహ్వానించారు. ఫిల్మ్‌సిటీ సందర్శన మధురానుభూతి నాకు ఇంకా గుర్తుంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.

  మమతా బెనర్జీ

* తెలుగువారికి ఇదొక పెద్ద విషాదం. రామోజీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలపమని ప్రధాని నన్ను పంపారు. రామోజీ ఆరోగ్యంపై రెండు నెలల క్రితమే ప్రధాని ఆరా తీశారు. ఆయన మరణం తెలుగు జాతికి తీరని లోటు. 

                              నిర్మలా సీతారామన్

* పత్రికతో ప్రజాచైతన్యానికి నాంది పలికిన అక్షర యోధుడు. . విశిష్ట వ్యక్తి రామోజీరావు మరణం బాధాకరం.  తెలుగు రాష్ట్రాల్లో తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.

 దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంత్రి, తెలంగాణ

* రామోజీ రావు పాత్రికేయ రంగంలో చెరగని ముద్ర వేశారు. పత్రికా స్వేచ్ఛ కాపాడేందుకు విశేష కృషి చేశారు. నేను మంచి స్నేహితుడిని కోల్పోయా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.

                              దత్తాత్రేయ

* ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు రామోజీ. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు తెలుగు ప్రజల జీవితాల్లో రామోజీ మమేకమై ఉన్నారు.  

  జస్టిస్ ఎన్వీ రమణ

* మీడియాకు రామోజీ చేసిన సేవలు అమూల్యం. ఆయన మరణం తీవ్ర విషాదానికి గురి చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 

                                       కిషన్‌రెడ్డి

* స్వయం కృషితో ఉన్నత శిఖరాలకు చేరుకున్న రామోజీరావు జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. జీవితంలో ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఉన్నా సరే గొప్ప విజయాలను ఎలా సాధించవచ్చ అనేది ఆయన ప్రస్థానం ద్వారా మనం  నేర్చుకోవచ్చు. తెలుగు మీడియా, వినోద రంగంలో ఆయనది చెరగని ముద్ర.   రామోజీరావు అంటే నాకు చాలా గౌరవం. 

కేసీఆర్, బీఆర్‌ఎస్ అధినేత

* మీడియా రంగంలో విలువలతో కూడిన నూతన ఒరవడికి ఆద్యుడు రామోజీరావు. ఆయన మృతి మీడియా రంగానికి  తీరని లోటు. మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతి.    

శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి

* రామోజీరావు మరణం తెలుగు ప్రజలకే కాదు దేశానికి తీరని లోటు. సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికి ఆదర్శం.   పత్రిక, టీవీ, సినిమా రంగాల్లో సాధించిన విజయాలు ఆయనకు మాత్రమే కాకుండా యావత్ తెలుగు జాతికి గర్వకారణం. జర్నలిజం, సాహిత్య రంగంలో ఆయన చేసిన కృషి గొప్పది. 

 తన్నీరు హరీశ్‌రావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే

* అంతర్జాతీయ స్ధాయిలో  ఎన్నో గొప్ప చిత్రాలకు రామోజీరావు జీవం పోశారు. అభ్యుదయ భావాలు కలిగిన మహనీయడు.  పట్టుదలకు మారు పేరు.  రామోజీ మరణం సినీ, పత్రికా రంగానికి తీరని లోటు. 

 కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి 

* రామోజీ రావు లేరనే వార్త ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. పాత్రికేయ రంగంపై ఆయన చెరగని ముద్ర వేశారు. తెలుగు బాషకు ఆయన చేసిన సేవలు మరువలేనివి. 

  పురందేశ్వరి