అక్షయ శుభాల తృతీయ
పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుడు యుధిష్టరునికి అక్షయ తృతీ య పర్వదిన పవిత్రత, ప్రాధాన్యాలను వివరించినట్లు తెలుస్తున్నది. ఇదే రోజున బద్రీనాథ్, గంగోత్రి ఆలయాల తలుపు లు తెరిచి పూజలు నిర్వహిస్తారు. శుక్రవా రం ‘అక్షయ తృతీయ’ సందర్భంగా పర్వదిన విశేషాలను తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ప్రతీ సంవత్సరం వైశాఖమాసంలో శుక్లపక్షం లో తదియ తిథినాడు ‘అక్షయ తృతీయ’ పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఏ పని చేపట్టినా ఖచ్చితం గా విజయం లభిస్తుందని నమ్ముతారు. భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ నాడు ఆవిర్భవించినట్టుగా ప్రజలు విశ్వసిస్తారు. అందుకే, ఈరోజును ‘అక్షయ తృతీయ’గా పిలుస్తున్నారు. బంగారానికి, ఈ పండుగకు ఏమిటి సంబంధం? అన్నది ముఖ్యమైన ప్రశ్న. బంగారం అనేది సాధారణ లోహం కాదు. పురాణాల ప్రకారం బంగారాన్ని ‘దేవలోహం’గా పరిగణిస్తారు. బంగారానికి ‘హిరణ్మయి’ అనే పేరుకూడా ఉంది. బంగారం కొనడం, దానం చేయడం వల్ల అత్యుత్తమ ఫలితా లు లభిస్తాయని పండితులు చెబుతారు.
ఈ రోజున ‘హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన’ అనే విష్ణు సహ స్ర నామం పఠించాలి. ‘విష్ణువు’ అంటే హిరణ్యగర్భుడు. తన గర్భం లోపల బంగారం కలిగిన వాడని అర్థం. అం దుకే, విష్ణువును బంగారానికి ప్రతిరూపంగా కూడా పరిగణిస్తారు. ‘అక్షయం’ అంటే ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటుందని అర్థం. ఈ రోజున ప్రతి ఒక్కరూ విలువైన ఆభరణాలు, స్థలాలు, ఇంటిని సమకూర్చుకోవడం వంటివి చేస్తుంటా రు. దీనివల్ల తమ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని, మరిన్ని శుభ ఫలితాలు కలు గుతాయని ప్రజలు నమ్ముతారు.
అక్షయ కుమారుడి జననం
హిందూ పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజునే పరశురాముడు, హయగ్రీవుడు, నర నారాయణుడు జన్మించా రు. ఈ పవిత్రమైన రోజున బ్రహ్మదేవుడి కుమారుడైన ‘అక్షయ కుమారుడు’ పుట్టా డు. అక్షయ తృతీయ వేళ యక్షరాజుకు నిధులు లభించాయని పురాణాల్లోనూ ఉంది. ఇదే రోజున భగీరథుని తపస్సు కారణంగా గంగమ్మ దివినుంచి భువికి దిగిందని నమ్ముతారు. ఇవాళే ద్వాపర యుగం ముగియడమేకాక సత్య, త్రేతా యుగాలు ప్రారంభమైనట్లు కూడా చెప్తా రు. ఆది శంకరాచార్యులు కనకధార స్తోత్రాన్ని ఈ రోజే రచించినట్లు తెలుస్తున్నది. ‘మహాభారత’ యుద్ధం ముగిసింది కూడా ఇవాళేనని తెలుస్తున్నది. ఇన్ని విశేషాలతో కూడుకున్న ఈ రోజున తెలం గాణలో మహిళలు ‘డోలాగౌరీ’ పూజ నిర్వహిస్తారు. పార్వతీదేవిని గౌరీమాతగా ఊయలలో పూజించడం ఆనవాయితీ.
దానాలతో విశేష ఫలాలు
ఏ కొంచెం దానం, జపం, యాగం చేసినా అవి అక్షయమైన ఫలితాలనిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. చైత్ర మాసాలు వసంతఋతువు. అప్పట్లో వైశాఖ పూర్ణిమ నుంచి ఎండలు మరింత తీవ్రంగా ఉండేవి. ఆ వేడిమిని తట్టుకోగలిగే వాటిని అక్షయ తదియ నాడు దానం చేయాలని, దీనివల్ల అంతులేని పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెప్తాయి . చెప్పులు, గొడుగులు, చల్లని మంచినీళ్లు వంటివి దానం చేసే సంప్రదాయం అలా నే ఏర్పడింది. భద్రాచలంలో జరిగే ‘శ్రీ సీతారాముల కల్యాణం’ సందర్భంగానూ కొందరు భక్తులు ‘తాటాకు విసనకర్రలు’ అందరికీ పంచ డం గమనార్హం. ఈ తిథినాడు కొత్త వస్త్రాలు దానం చేయాలి. శక్తి గలవారు బంగారం దానం చేసినా ఎంతో పుణ్యం. అక్షయ తృతీయనాడు ఎంతో కొంత బంగారం కొనుక్కో వడం వల్ల కూడా పాపం తొలగుతుందన్న విశ్వాసమూ ఉంది.
వాడపల్లి శ్రీధర్
వ్యాసకర్త సెల్: 99898 55445






