14 April, 2026 | 8:03 PM

సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ పోరాటం ఆదర్శం: ఏజే రమేష్

14-04-2026 03:52 PM

ఇల్లందు,(విజయక్రాంతి): సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఏలూరి భవన్‌లో డా. బీ ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆలేటి కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకుడు ఏజే రమేష్ పాల్గొని మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక న్యాయం కోసం అనేక ఉద్యమాలు నడిపిన మహనీయుడని అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చి మనువాద సిద్ధాంతాలను అమలు చేయాలని చూస్తుందని, ఎస్‌ఐఆర్ ద్వారా ప్రతిపక్ష ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలతో కార్పొరేట్ సంస్థలకు మద్దతు ఇస్తోందని విమర్శించారు. సామాజిక న్యాయం కోసం పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అబ్దుల్ నబి, తాళ్లూరి కృష్ణ, మన్యం మోహన్ రావు, సుల్తాన్, ఖాదర్, మాదారపు వెంకటేశ్వర్లు, సర్వన్ కుమార్, సంధ్య, కడారి వెంకటమ్మ, మరియా తదితరులు పాల్గొన్నారు.