20 June, 2026 | 2:29 AM

గాంధీ సరోవర్‌కు గ్రీన్ సిగ్నల్

20-06-2026 01:06 AM
  1. రక్షణ శాఖ భూముల్లో ప్రాజెక్టుకు అనుమతి 
  2. కేంద్రమంత్రి రాజ్‌నాథ్, భారత సైన్యానికి సీఎం రేవంత్ కృతజ్ఞతలు

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): మూసీ రివర్ ఫ్రంట్ అభివృ ద్ధిలో కీలక అడుగు పడింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మూసీ నదుల సంగమ స్థలంలోని బాపూఘాట్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ అను మతి ఇచ్చింది. బాపుఘాట్‌ను 533.42 కోట్లతో 83.818 ఎకరాల్లో గాంధీ సరోవర్‌గా అభివృద్ధి చేసేందుకు వర్కింగ్ పర్మి షన్ మంజూరు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఆర్టిలరీ సెంట ర్ గోల్కొండ పరిధిలోని భూమిపై అభివృద్ధి పనులకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు అనుమతి మంజూరు చేయడం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు, భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అనుమతి లభించడం, తెలంగాణ ప్రభుత్వ విజన్ లక్ష్యాలను సాధించడంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు.

మూసీ నది సమగ్ర పునరుజ్జీవనం, నదీ తీర ప్రాంతాల అభివృద్ధి, అలాగే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే పర్యావరణ, సాంస్కృతిక, సామాజిక వనరుల సృష్టి దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఈ నిర్ణయం మరింత బలాన్ని చేకూరుస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా మూసీ నది పరివాహక ప్రాంతం పర్యావరణపరంగా పునరుజ్జీవం పొందడమే కాకుండా ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రజా స్థలాలు, సాంస్కృతిక కేంద్రాలు, పర్యాటక ఆకర్షణలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.