20 June, 2026 | 2:29 AM

హైడ్రాతో అద్భుత ఫలితాలు

20-06-2026 01:14 AM

* 2024 జూలై 19 ఏర్పాటైన హైడ్రా చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల వైపు కన్నెత్తి చూడాలంటే కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టేలా చేసింది. అటు ప్రజల్లోనూ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లపై అవగాహన కల్పించింది. ప్రభుత్వ భూములు, పార్కుల లేఔట్లు, ఖాళీ స్థలాలు, పరిశ్రమ శాఖ స్థలాలు, చెరువులు, కుంటల్లోని కబ్జాలకు చెక్ పెడుతున్నది. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది.

ప్రభుత్వ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకొని సంబంధిత శాఖకు సరెండర్ చేస్తుంది. వరదలు, భారీ వర్షాలు తలెత్తినప్పుడు ముప్పు లేకుండా ఉండేలా ప్రత్యేక ప్లాన్ రూపొందించి అమలు చేస్తుంది. హైడ్రాపై తెలంగాణ రాష్ట్రీయ లోకల్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని సెంట్రల్ కోర్టు లకిడికాపూల్ హోటల్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడుతుంది. దీనికి అందరూ ఆహ్వానితులే.

1. జీహెచ్‌ఎంసీ పరిధిలో 185 హెచ్‌ఐఎంఎ పరిధిలో 3500 పైగా చెరువులున్నాయి. హైదరాబాద్‌లో కాసింత స్థలం దొరికితే చాలు తెల్లారే సరికల్లా కబ్జా చేస్తున్న రోజులు. అలాంటిది పర్యవేక్షణ లేని చెరువుల్ని, కుంటల్ని కబ్జా చేసి రెసిడెన్షియల్, కమర్షియల్ బిల్డింగులు కట్టేశారు. తాజాగా రిమోట్ సెన్సింగ్ సెంటర్ నిర్వహించిన ప్రత్యేక అధ్యయనంలో 56 చెరువుల్లో 6000కు పైగా ఎకరాలు ఆక్రమణకు గురైనట్లుగా తేల్చడం వాస్తవ పరిస్థితికి నిదర్శనం.

జీహెచ్‌ఎంసీకి చెందిన ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగంలో 500 మంది అన్యాయాలకు అలవాటుపడి అటువైపు చూడలేదు. హెచ్‌ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ విభాగం నామ్‌కే వాస్తేగా మారింది. అదికాకుండా హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. ఇలాంటి తరుణంలోనే సీఎం రేవంత్‌రెడ్డి అప్రమత్తమై హైడ్రాను ఏర్పాటు చేశాడు.

2. హైడ్రా పరిధి జీహెచ్‌ఎంసీతో పాటు శివారు ప్రాంతాల్లోని 2000 చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే హైదరాబాద్ విస్తీర్ణం కంటే హైడ్రా విస్తీర్ణం మూడు రెట్లు ఎక్కువ. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని హైడ్రాలో విలీనం చేశారు. దానికి కమిషనర్‌గా కొనసాగుతున్న సీనియర్ ఐపీఎస్ అధికారి వివి రంగనా త్‌ను హైడ్రాకు కమిషనర్‌గా నియమించారు. హైడ్రా పరిధిలో 2 కమిటీలుంటాయి.

ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉండే పాలక మండలిలో పురపాలక, రెవెన్యూ శాఖ మంత్రులు, రాజధానిలోని జిల్లాల ఇంచార్జి, ఇతర సీనియర్ ఆఫీసర్ సభ్యులు ఉంటారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో డిజాస్టర్ మెనేజ్మెంట్ ఏజెన్సీ రెండో కమిటీగా ఉంటుంది. ఇందులో కేవలం సీనియర్ ఆఫీసర్స్ మాత్రమే ఉంటారు. ఈ రెండు కమిటీలకు హైడ్రా కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. 

హైడ్రా మొత్తం 3 రకాల విధులు నిర్వహిస్తున్నది. ఓఆర్‌ఆర్ వరకు గల ప్రభుత్వ భూములు పార్కుల లేఔట్లు, ఖాళీ స్థలాలు, పరిశ్రమ శాఖ స్థలాలు చెరువులు కుంటల్లోని కబ్జాలకు చెక్ పెడుతున్నది. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. ప్రభుత్వ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకొని సంబంధిత శాఖకు సరెండర్ చేస్తుంది. అలాగే సహజ విపత్తులు సంభవించినప్పుడు అంటే వరదలు, భూకంపాలు భారీ వర్షాలు తలెత్తినప్పుడు ముప్పు లేకుండా ఉండేలా ఒక ప్రత్యేక ప్లాన్ రూపొందించి అమలు చేస్తుంది.

అలాగే విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇతర శాఖలకు సపోర్ట్ ఉంటుంది. వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రభావిత ప్రాంతాలు, సంబంధిత శాఖలను అప్రమత్తం చేస్తుంది. ఫైర్ ఎన్‌ఎసిలు జారీ చేయాలంటూ దరఖాస్తు చేసుకున్న భవనాలను పరిశీలించవచ్చు. ట్రాఫిక్ పోలీసు సమన్వయంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంది.

3. హైదరాబాద్ నగరంలో అక్రమాలకు గురి అయిన పుట్‌పాత్‌లు, రోడ్లు, వాగులు, నాలాలు, చెరువులు, చిట్టడవులు, ప్రభుత్వ భూములను కాపాడటానికి హైడ్రా ఏర్పాటు అయ్యింది. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ ఆస్తులను కాపాడటానికి హైడ్రా ఏర్పడిన విషయంలో చట్టబద్ధత ప్రశ్న నిరంతరంగా ఎదురువతున్నది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఇప్పటికే చట్టాలున్నాయి. ఆయా చట్టాల అమలు అదే అధికార యంత్రాంగం ద్వారా సాధ్యం కాకనే ఒక ప్రత్యేక విభాగంగా హైడ్రా ప్రతిపాదన వచ్చింది.

ఇది పాలనా సంస్కరణగా కాకుండా ప్రజలకు తక్షణ మార్పులను అందించే ఉద్దేశంతో ఉన్న ఒక కొత్త ఆలోచన పాలనలో ఒక ఆయుధం అయితే హైడ్రా పట్ల పాలక వర్గాలలో అంతర్లీనంగా మొదటి నుండి వ్యతిరేకత ఉన్నది. ప్రభుత్వ భూములు, ప్రజల ఉమ్మడి ఆస్తులను కొల్లగొట్టడంలో ఈ వర్గాలే ముందున్నాయి. ఇందులో 4 వర్గాలు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు బిల్డర్లు.

4. 2024 జూలై 19 ఏర్పాటైన హైడ్రా కొద్దికాలంలోనే చెరువుల ఎఫ్‌టీఎల్, బపర్ జోన్ల వైపు కన్నెత్తి చూడాలంటే కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టేలా చేసింది. అటు ప్రజల్లోనూ ఎఫ్‌టీఎల్, బపర్ జోన్లపై అవగాహన కల్పించింది. పార్కులు, నాలాలు రోడ్లు, ఫుట్‌పాత్ వంటి ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా బుల్డోజర్ చర్యలు తీసుకుంటోంది.

5. 2024 జూలై 27న ఫిల్మ్ నగర్‌లోని కొ ఆపరేటివ్ సొసైటీ వద్ద లోటస్ పాండ్ పార్క్ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన కాంపౌండ్ వాల్‌ను కూల్చడంతో హైడ్రా యాక్షన్ మొదలైంది. అప్పట్నుంచి ఎమ్మేల్యేలు, ఎమ్మేల్సీ సెలబ్రిటీలు ఇలా ఎవరి ఆక్రమణలు వదల్లేదు. హైడ్రా అంటే కూల్చివేతలు, భవనాల ధ్వంసమేనన్న భావన మొదట్లో ఉండగా అవేమి పట్టించుకోకుండా చెరువుల పరిరక్షణ కోసం తన పని తాను చేసుకుంటూ పోతోంది.

పైలట్ ప్రాజెక్టులో భాగంగా 6 చెరువులను అభివృద్ధి చేయాలని ఎంపిక చేయగా మొదటగా అంబర్‌పేటలో బతుకమ్మ కుంటను పురుద్ధరించింది. 1962 లెక్కల ప్రకారం ఈ చెరువు 14 ఎకరాల 6 గుంటలు బఫర్ జోన్‌తో కలిపి ఎ.16 గుంటలుగా ఉండేది. అక్రమాల కారణంగా తగ్గి తాజా హైడ్రా సర్వే ప్రకారం ఎ.5 గుంటలు మాత్రమే మిగిలింది. కోర్టు కేసులను ఎదుర్కొని చెరువు భూమిగా నిర్ధారణ అయిన తరువాత హైడ్రా రూ.7 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది.

కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్ రాళ్లతో గట్టు ఏర్పాటు చేస్తూ ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. అలాగే మాదాపూర్ సున్నంకుంట చెరువు 14.09 ఎకరాలు, తమ్మిడి కుంట 13 ఎకరాలు, పాతబస్తీలోని బుమ్రాక్ సుద్దాలా 12.54 ఎకరాలు, ఉప్పల్ చెరువు 15.26 ఎకరాలు, కూకట్‌పల్లి నల్ల చెరువు 15 ఎకరాలకు పూర్వ వైభవం తీసుకు వచ్చింది. సుమారు ఏడాది కాలంలోనే హైడ్రా సాధించిన అనేక విజయాలలో మచ్చుకు కొన్నింటిని ఉదహరించుకోవచ్చు.

కోకాపేటలో అక్రమ నిర్మాణాలు, అల్వాల్ చిన్నారికుంటలో అక్రమంగా నిర్మించిన 3 భవనాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు, ఫీర్జాదిగూడ మున్సి పల్ కార్పొరేషన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు కూల్చివేత. వర్షాకాలంలో రహదారులపై వరదనీరు నిలిచిపోయి ట్రాపిక్ సమస్యలు తలెత్త కుండా హైడ్రా ప్రత్యేక చర్యలు చేపట్టింది.

సుమారు 300 ప్రాంతాల్లో వరద నీటి నిల్వ సమస్యను గుర్తించి పరిష్కారం చూపించి పర్యావరణ పరిరక్షణలో భాగంగా 12 సరస్సులను పునఃరుద్ధరించాలని ప్రణాళికను రచించింది. సంస్థ చేసిన కృషి ఫలితంగానే ఎఫ్‌టీఎల్, బపర్ జోన్లపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగింది. తద్వారా ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ కొనుగోళ్ల విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ తమ కష్టార్జితాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. 

6. గాజుల రామారాంలో 15 వేల కోట్ల విలువైన 300 ఎకరాలను కాపాడిన హైడ్రా మేడ్చల్ జిల్లా కుత్భుల్లాపూర్ నియోజకవర్గం సర్వే నెం.307లో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించిన 300 ఎకరాల ప్రభుత్వ భూమిలో పేదల పేరుతో కొందరూ కబ్జాదారులు, ప్రజాప్రతినిధులు వందల సంఖ్యలో లేఔట్లు వేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు.

ఇదే సర్వే నెం. చుట్టూ కబ్జాలు జరుగక ప్రగతి నగర్ వైపు ఏకంగా లేఔట్లు, వెంచర్లు వేశారు. ఇట్టి భూమిపై హైడ్రాకు ఫిర్యాదు అందడంతో దీంతో మేడ్చల్ కలెక్టర్ మనూ చౌదరి ఫీల్డ్ లెవల్లో పర్యటించి ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనది నిజమేనని తేల్చారు. 60--120 గజాల పాట్లు వేసి నిరుపేదలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ అక్రమణలను హైడ్రా తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడింది. 

7. పాతిమా ఓవైసి కాలేజిని కూల్చబోం- సల్కం చెరువు పరిధిలో నిర్మించిన పాతిమా ఓవైసీ కాలేజీ కూల్చివేత గురించి వివరిస్తూ అక్బరుద్దీన్‌పై దశాబ్దం క్రితం జరిగిన దాడికి గుర్తుగా ఆ కాలేజీని నిర్మించాడు. ఆ కాలేజీలో 10 వేల మంది పేద విద్యార్థుల చదువుకుంటున్నారు. వారికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయి. మేము వారి జీవితాలను నాశనం చేయలేమని చెప్పారు.

8. ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ కట్టడాలను తొలగించి భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో సహజంగానే ఆక్రమణదారులకు కంటగింపుగా ఉంటుంది. వారి ఆగడాలను, ధర్నాలను ప్రచారం చేయడానికి కొన్ని మీడియా సంస్థలు చేసిన ప్రయత్నాల హడావుడిలో మొదట్లో హైడ్రా పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పడినా కాలక్రమేణా హైడ్రా చేపట్టిన చర్యలు వాటి సత్ఫలితాలు వలన ప్రజలో హైడ్రా పట్ల గురి కుదిరింది. 2 సంవత్సరాల కాలంలో జరుగుతున్న చెరువుల పునరుద్ధరీకరణ పూడికతీత కార్యకలాపాలు, నాలాలపై ఆక్రమణల తొలగింపుతో వరదనీటి ఆటంకం లేకుండా ముంపు ప్రాంతాలకు మేలు జరిగిన వైనం ప్రజలకు ఎంతగానో నచ్చింది.

9. గాజుల రామారం, గండిపేట తదితర 18 ప్రాంతాల్లోని 44 ఎకరాల్లో గల 166 అక్రమ నిర్మాణా లను కూల్చేసింది. దానం నాగేందర్‌తో పాటు ఎంఐఎం ఎమ్మేల్యేపై కేసు పెట్టింది. మంత్రి పళ్లం రాజు ఫామ్‌హౌస్‌ను, తుమ్మిడి హట్టి చెరువును ఆక్రమించి నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కేవలం 4 గంటల్లోనే సైటెంట్‌గా నేలమట్టం చేశారు.

10. నాయకుల వరుస పిర్యాదులతో హైడ్రా సైలెంట్ అవుతుంది అని అందరూ భావించారు. కానీ హైడ్రా కారణంగా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందంటూ ఇంటలిజెన్స్ వర్గాలు సీఎం రేవంత్‌రెడ్డికి రిపోర్టు ఇచ్చాయి. అదే రిపోర్టును సీఎం రేవంత్‌రెడ్డి హైకమాండ్ ముందు ఉంచారు. హైకమాండ్ కూడా గోహెడ్ అని చెప్పింది. 

11. విలువైన భూములను అవినీతి అధికారుల ఆసరాతో రాజకీయ బలంతో అప్పనంగా కాజేసే ప్రబుద్ధులకు వెన్నులో చలిపుట్టే విధంగా న్యాయపరంగా హైడ్రా కార్యకలాపాలు ఊపందు కున్నా యి. హైడ్రా భయం వలన ప్రస్తుతం ప్రభుత్వ భూముల జోలికి వెళ్లడానికి కాకలు తీరిన ఆక్రమణదారులు, పేరు మోసిన నేరస్తులు సైతం వెనుకంజ వేస్తున్నారు.

12. మొదట కూల్చేయ్, తర్వాత కంచె వేసి బోర్డు పెట్టు, తర్వాత చేసిన పనిని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయ్, హైకోర్టులో వ్యతిరేకమైన తీర్పులు వస్తే వాటిని అమలు చేయకుండా తప్పించుకో అన్నట్లుగా హైడ్రా వ్యవహరిస్తోందని హైకోర్టు ఒక సమయంలో హైడ్రా గూర్చి వాఖ్యానించింది. ఏది ఏమైనా హైడ్రా వలన ప్రభుత్వా నికి అనుకూలత మరియు వ్యతిరేకత వచ్చాయి. సామాన్యుడికి సరైన నష్టపరిహారం చెల్లించిన తరువాతే హైడ్రా తదుపరి చర్యలు చేపడితే బాగుంటుందని చాలామంది అభిప్రాయ పడుతున్నారు.

 కపిలవాయి దిలీప్ కుమార్ (మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు

 హైడ్రాపై తెలంగాణ రాష్ట్రీయ లోకల్ ఆధ్వర్యంలో 20.06.2026 నాడు 

హైదరాబాద్‌లోని సెంట్రల్ కోర్టు లకిడికాపూల్ హోటల్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడుతుంది. 

దీనికి అందరూ ఆహ్వానితులే.