calender_icon.png 23 February, 2026 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మౌనాన్ని చీల్చి ప్రశ్నించే ‘అలికిడి’

23-02-2026 02:30:02 AM

కవిత్వం అనేది కేవలం పదాల అలంకారం కాదు. అది కాలాన్ని ప్రశ్నించే ఒక గళం, మౌ నాన్ని చీల్చే ఒక అలికిడి. కార్తీక రాజు ‘అలికిడి’ సంపుటిలోని కవితలు కూడా అచ్చంగా అలాంటి స్వరాలే. ఆ కవిత్వం వ్యక్తిగత అనుభూతి నుంచి మొదలై, సామూహిక వేదన వరకూ విస్తరించే ప్రయాణం. వలస కళాకారుల అస్తిత్వ వేదన, ఇంద్రవెల్లి వంటి మారణకాండల నెత్తుటి జ్ఞాపకాలు, కాకతీయుల వారసత్వంగా నిలిచిన చిహ్నాల గర్వం.

స్త్రీలపై జరుగుతున్న లైంగిక హింసపై అగ్నిగర్భ ఆగ్రహం. ప్రజాపక్ష భావజాలంపై రాజ్య అణచివేతకు ఎదురు నిలిచే ధిక్కారం.. ఇవన్నీ ఈ కవిత్వంలో మనం చూడవచ్చు. ‘వలస మనుషుల జాతి’ అనే కవితలోని కవిత్వ పాదా లు వలస జీవులైన కళాకారుల జీవితాన్ని కాలచక్రం, కాళ్లచక్రాలు, సంచారం వంటి ప్రతీకల ద్వారా అత్యం త హృదయ విదారకంగా చిత్రిస్తాయి.

‘నెత్తుటి జ్ఞాపకాల నేల’ అనే కవితలో కవి ఇంద్రవెల్లి మారణ కాండను వ్యక్తిగత అనుభూతి, సామూహిక జ్ఞాపకం రెండింటి సంగమంగా ఆవిష్కరిస్తాడు. చిన్ననాటి నుంచి ‘ఇంద్రవెల్లి’ అనే మాట వినగానే ఇతరుల ముఖాల్లో వాలిపోయే తెలియని విషాదాన్ని ప్రస్తావిస్తూ, ఆ పేరు ఒక భౌగోళిక ప్రాంతం కంటే ముందే ఒక భయానక జ్ఞాపకంగా ఎలా ముద్రపడిందో కవి చూపిస్తాడు. ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది అనే పాట ప్రస్తావన ద్వారా ప్రజాస్మృతిలో ఆ ఉద్య మం ఎలా జీవించిందో తెలియజేస్తాడు. 

కాకతీయుల వైభవం అక్షరబద్ధం

‘విశ్వకీర్తినొందిన చిహ్నాలు’ అనే కవితలో కవి కాకతీయుల శిలాతోరణాలను చరిత్ర, గౌరవం, పోరాట స్ఫూర్తి కలిసిన మహత్తర ప్రతీకలుగా ఆవిష్కరిస్తాడు. ‘కాకతీయులు’, ‘ఓరుగల్లు’ అనే పదాలు వినగానే మనసు కాన్వాస్‌పై తక్షణం రూపుదిద్దుకునే శిలాతోరణాల చిత్రణ ద్వారా, అవి తెలంగాణ చారిత్రక చైత న్యంలో ఎంత లోతుగా నాటుకుపోయాయో కవి సూచిస్తాడు. యుద్ధఘోషలు, వీరుల రక్తధారలు, విజయధ్వానాల్ని చూసిన సాక్ష్యులుగా తోరణాలను మా నవీకరించడం ఈ కవితలో ముఖ్యమైన శిల్ప లక్షణం. ‘దుష్ట దండయాత్రలను, ప్రకృతి ప్రళయాలను అధిగమించాయని చెప్తూ, ఠీవీగా నిలుచొని నినది స్తున్నాయి’

అన్న పాదం ద్వారా కవి తెలంగాణ చరిత్ర తాలూకు అజేయత్వాన్ని ప్రతిబింబిస్తాడు. ఒకప్పుడు స్వయంభూ శివాలయానికి స్వాగత ద్వారాలుగా ఉన్నవి, నేడు తెలంగాణ రాజ్య రాజముద్రలుగా, పోరాట స్ఫూర్తిని నింపే సూత్రాలుగా మారాయని చెప్పడం ద్వారా గతవర్తమానాల మధ్య సాంస్కృతిక నిరంతరతను బలంగా స్థాపిస్తాడు. ‘అంగాలను తెగ్గో ద్దాం పదండి’ అనే కవిత ద్వారా కవి ఆవేదన, ప్రతిఘటనను ఒకేసారి వ్యక్తీకరిస్తాడు.

లాభం నష్టం, సుఖందుఃఖం కూడా తెలియని పసిపాపల అమాయకత్వాన్ని మొదట స్పష్టంగా ప్రతిష్ఠించి, వారి మీద జరుగుతున్న లైంగిక హింస ఎంత అమానుషమైందో కవి బలంగా నిలదీయడం ఈ కవిత ప్రధాన శక్తి. ప్రశ్నల రూపంలో (ఎందరు బలై ఉంటారిప్పటికి? లెక్క పెట్టారా?) సమాజపు నిర్లక్ష్యాన్ని, ‘మనకు జరగలేదు కదా’ అనే మానసికతను కవి తీవ్రంగా ప్రశ్ని స్తాడు. పాఠకుణ్ణి బలవంతంగా ఆ స్థితిలో నిలబెట్టి ఊహించుకోమని కోరడం ద్వారా ఈ కవిత కేవలం చదివే అనుభవంగా కాక, అనుభూతిగా మారుతుంది.

అత్యాచారులను ‘మగ పిశాచాలు’, ‘విష మృ గాలు’గా వర్ణించడం ద్వారా కవి వారిని మానవత్వం లేని శక్తులుగా చిత్రిస్తాడు. అదే సమయంలో శిక్షల పట్ల ఉన్న కఠినమైన, అతి తీవ్ర రూపకాత్మక భాష కవి లోపల ఉడికే కోపాన్ని ప్రతిబింబిస్తుంది. కొవ్వొత్తుల ప్రదర్శనలు, మౌన నివాళుల వంటి ప్రతీకలపై వ్యంగ్య ప్రశ్నలతో ఈ కవిత నిరసనల వృథాతనాన్ని ఎత్తిచూపుతుంది. ‘అంతులేని ఆరాటం’ అనే కవితలో కవి తన సృజనాత్మక అసమర్థతలని స్వయంస్వీకారంతో ఒప్పుకొం టూనే, తన భావాల పట్ల ఉన్న అచంచలమైన నిబద్ధతను గట్టిగా ప్రకటిస్తాడు.

‘దట్టమైన చిక్కటి తేనెతు ట్టెల్లా భావావేశాలు అనే ప్రతీక కవి మనసులో ఉవ్వెత్తున ఎగసే ఆలోచనల బరువును చక్కగా ఆవిష్కరి స్తుంది. రచనా విధానం తప్పా? ఒప్పా? అన్న సందేహాన్ని పక్కనపెట్టి, భావం శ్రేయోవాదమైనప్పుడు విమర్శలు రాళ్లలా పడినా, ప్రశంసలు పూలలా పడి నా ఆగకుండా సాగుతానన్న ధైర్యోక్తి కవి ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. స్వరపేటిక పగిలిపోయేంతగా పాడైనా అనే పాదం ద్వారా కవి తన కవిత్వాన్ని శబ్దశుద్ధి కంటే భావస్పర్శకే అంకితం చేసినట్టు తెలుస్తుం ది. మొత్తంగా ఈ కవిత స్వీయవిమర్శతో కూడిన అభ్యుదయ సాహిత్య ధోరణిలో నిలుస్తుంది.

కవి చెప్పదలుచుకున్నది ఒక్కటే.. పరిపూర్ణ కవిత్వం కన్నా గుండెలను కదిలించే నిజమైన భావమే ముఖ్యం, ఆ భావాన్ని పంచాలనే అంతులేని ఆరాటమే తన సృజనకు ప్రాణం. ‘శాసనంగా ప్రకటిస్తున్నా’ అనే కవిత ప్ర జాపక్ష సాహిత్యానికి ఒక ధిక్కార స్వరంగా, అచంచలమైన ప్రతిఘటన ప్రకటనగా నిలుస్తుంది. ‘పదునైన కలాలపై బందూకుల బలాలు’, ‘గళాలపై చురకత్తుల కవాతు’ అన్న రూపకాల ద్వారా కవి రాజ్య అణచివేత స్వభావాన్ని

స్పష్టంగా ఆవిష్కరిస్తూ, అలాంటి కాలం లో మౌనంగా ముడుచుకుని కూర్చోవడం అసాధ్యమని గట్టిగా ప్రకటిస్తాడు. వలస మనుషుల నుంచి ఉద్యమకారుల వరకు, స్త్రీ నుంచి ప్రకృతి వరకు.. ఈ కవితలు అస్తిత్వం, గౌరవం, స్వేచ్ఛల కోసం సాగే నిరంతర పోరాటానికి సాహిత్య సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఈ సంపుటి చదివిన తర్వాత మనం మునుపటిలానే ఉండలేం. ఏదో ఒక అలికిడి మనలో మొదలవుతుంది.

ఆ అలికిడినే ఆలోచనగా, ఆలోచనను చర్యగా మలచగలిగిన రోజే ఈ కవిత్వానికి నిజమైన ముగింపు. సమాజాన్ని కదిలించే భావాలతో ప్రజాపక్ష సాహిత్యానికి బలమైన స్వరం జోడించిన ఈ రచన మరెన్నో సాహిత్య ప్రయాణాలకు ఆరంభమై, కవి నుంచి ఇంకా లోతైన, మరింత బలమైన, మెరుగైన సాహిత్యం వెలుగులోకి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

     గాజోజి శ్రీనివాస్