ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలి
- టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి
అర్హులైన ప్రతి లబ్ధిదారుకు సంక్షేమ పథకాలు : జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ప్రజాపాలనప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం కంది మండలంలోని రైతు వేదికలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని ఆలపించి, ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు తమ పరిధిలో అమలవుతున్న సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు.
ఈ సందర్భంగా రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, కొత్త రేషన్ కార్డులు, పాస్బుక్కులు, సన్నబియ్యం పంపిణీ, వైద్య సేవలు తదితర పథకాల లబ్ధిదారుల వివరాలను ప్రజలకు తెలియజేశారు. అలాగే ముఖ్యమంత్రి అల్పాహారం పథకం, ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యా హ్న భోజన పథకం విస్తరణ వంటి నూతన పథకాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చివరి కుటుంబానికి చేరేలా అవగాహన కల్పిస్తున్నా మన్నారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ మార్చి 6 నుంచి ప్రభుత్వం 99 రోజుల యాక్షన్ ప్లాన్ కింద ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదన్నారు.
ఇప్పటికే శానిటేషన్, ఆరో గ్య కార్యక్రమాలు నిర్వహించామని, ఏప్రిల్ 2న గ్రామ సభలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఈ వారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రతి గ్రామంలో పోలీస్ శాఖతో కలిసి రోడ్డు భద్రత ఫై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డిఐసి జిఎం తుల్జా నాయక్ , ఎంపీడీవో శ్రీనివాస్ , తహసిల్దార్ రవికుమార్ ,ఎంపీఓ మహేందర్ రెడ్డి, సర్పంచులు, ఉప సర్పంచులు, మండల సమాఖ్య ప్రతినిధులు, మహిళలు, రైతులు పాల్గొన్నారు.






