నాగల్ గిద్దలో అసంపూర్తిగా ఇందిరమ్మ మోడల్ ఇల్లు నత్తనడకన పనులు
నాగల్ గిద్ద, ఏప్రిల్ 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రతి మండల కేంద్రంలో నిర్మించాల్సిన మోడల్ ఇల్లు నాగల్ గిద్ద మండల కేంద్రంలో నాణ్యత లేకుండా అసంపూర్తిగా దర్శనమిస్తోంది. గ్రామాల్లో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు ఆదర్శంగా నిలవాలనే ఆశయంతో ప్రభుత్వం మండల కేంద్రాల్లో మోడల్ ఇళ్ల నిర్మాణం చేపట్టింది.
అయితే నాగలిగిద్ద ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న మోడల్ ఇల్లు గోడల వరకు పూర్తయి పైకప్పు లేకుండా నిలిచిపోయిందని, నిర్మాణం నత్తనడకన సాగుతోందని, మోడల్ ఇల్లునే ఇలా నిర్లక్ష్యం చేస్తే లబ్ధిదారులకు ఎలా ఆదర్శంగా నిలుస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న ఇంటిని పూర్తి చేయాలని, ఆశయం నీరుగారకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






