భిన్నాభిప్రాయాల అఖిలపక్ష భేటీ
- కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశం
- మంచి చర్చ జరిగిందన్న కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
- 20 ప్రతిపక్ష పార్టీలు వాకౌట్
- పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేనా? రసాభాసేనా?
- నేడే రాజ్యసభ ముందుకు వందేమాతరం బిల్లు?
న్యూఢిల్లీ, జూలై 19: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందు ఆదివారం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం భిన్నాభిప్రాయాలకు వేదికై 20 ప్రతిపక్ష పార్టీలు సమావేశాన్ని బహిష్కరించారు. ఇటు సమావేశం చాలా బాగా జరిగిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. 20 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీ పార్లమెంట్ హౌస్‌లోని అనెక్స్ భవనంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
మొత్తం 40 పార్టీలకు చెందిన నాయకులు ఇందులో పాల్గొన్నారు. అయితే సమావేశం మధ్యలోనే 20 ప్రతిపక్ష పార్టీలు వాకౌట్ చేశాయి. మూడు గంటలపాటు నిర్వహించిన ఈ సమావేశ వివరాలను కేంద్రమంత్రి రిజిజు మీడియాకు వివరించారు. ప్రతీఒక్కరూ తమ తమ అభిప్రాయాలను వివరించారన్నారు. సమావేశంలో మంచి చర్చ జరిగిందని, పార్లమెంట్ సభ సజావుగా సాగేలా చూడటం మనందరి బాధ్యత అని వివరించామన్నాని కిరణ్ రిజిజు పేర్కొన్నారు.
కాగా సభను వాకౌట్ చేసిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మీడియాతో మాట్లాడుతూ.. అఖిలపక్ష సమావేశంలో టీఎంసీ నుంచి తిరుగుబాటు చేసిన ఎంపీలకు చోటు కల్పించడాన్ని వ్యతిరేకించారు. ఈ సమావేశంలో ఆ ఎంపీలు ఎందుకున్నారని ప్రశ్నించారు. దీనికి నిరసనగానే ప్రతిపక్షాలు సమావేశాన్ని బహిష్కరించాయని చెప్పుకొచ్చారు. సమావేశాన్ని బహిష్కరించిన పార్టీలలో కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, జేఎంఎం, ఆప్, నేషనల్ కాన్ఫరెన్స్, వామపక్ష పార్టీలు, శివసేన తదితర పార్టీలున్నాయి.
లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును, ప్రక్రియను అడ్డుకుంటామని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ స్పష్టం చేశారు. అనేక సమస్యలను, రామాలయం చోరీ, నీట్‌లాంటి వాటిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ ఎంపీ కె. సురేష్ పేర్కొన్నారు. టీఎంసీ, ఆప్, శివసేన ఎంపీలను తమవైపు లాగి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినందుకు తాము అఖిలపక్ష సమావేశాన్ని వాకౌట్ చేశామని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అన్నారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ ప్రక్రియల లాంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉందని ప్రతిపక్షాల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని జేఎంఎం రాజ్యసభ ఎంపీ మహువా మాఝీ అన్నారు.
ఇతర పార్టీల ఎంపీలను తమ పార్టీలో చేర్చుకోవడం అన్యాయమన్నారు. పలు పరీక్షా పేపర్లు లీక్ కావడం, ఎస్‌ఐఆర్‌పై అనుమానాలు, అపోహలు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఇలా అనేక అంశాలపై సమగ్రమైన జవాబుదారీతనం కావాలని సీపీఐ రాజ్యసభ ఎంపీ పీ సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. కేంద్రం తమ బాధ్యతలనుంచి తప్పించుకోరాదని, అనుమానాలను నివృత్తి చేయాలని అన్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాక సమస్యలను కేంద్ర ప్రభుత్వం పక్కన పెడుతుందని, చర్చించే అంశాలను చర్చించకుండా పక్కదారి పట్టిస్తున్నారని, సొంతప్రయోజనాలను నెర వేర్చుకునేందుకు మాత్రమే ప్రతీసారి సభ నిర్వహిస్తున్నట్లుగా ఉంటుందని కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ చమల ఆరోపించారు.
కాగా ఈసారి పార్లమెంట్ సమావేశాలు సజావుగా కొనసాగుతాయా? ప్రతిపక్షాల నిరసనలు, ఆందోళనలతో రసాభాసాగా ముగుస్తాయా? అన్నది వేచిచూడాల్సిందే. కాగా పార్లమెంట్ సమావేశాల తొలిరోజైన సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో వందేమాతరం బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. దీంతోపాటు ఈ సమావేశాల్లో ఆదాయపు పన్ను (సవరణ), 2026 సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ, 2026 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ), 2026 వారసత్వ, విదేశీ విరాళాల (నియంత్రణ), 2026 వికసిత్ భారత్ ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్‌మెంట్ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.






