ఉత్తరాదిన వర్ష బీభత్సం
- కశ్మీర్, ఉత్తరాఖండ్, నాగాల్యాండ్‌లలో భారీ వర్షాలు
- 23 మంది మృతి, పలువురు గల్లంతు
- ఆకస్మిక వరదలు, విరిగి పడుతున్న కొండచరియలు
శ్రీనగర్, జూలై 19: ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదలు, పిడుగులు పడడం, కొండచరియలు విరిగిపడటంతో ఆయా రాష్ట్రాల్లో 23 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి, పూంచ్‌లో 11మంది, నాగాలాండ్‌లో 8, ఉత్తరాఖండ్‌లో ఇద్దరు, చత్తీస్‌గఢ్‌లో ఇద్దరు మృతి చెందారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి, పూంచ్‌లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి ఆదివారం వరకు 11 మంది మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు.
రాజౌరిలో ఉన్న అన్ని ప్రధాన నదులు ఉప్పొంగి ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్నాయి. తీర ప్రాంతవాసులు వందలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పూంచ్‌లో భారీ వర్షం కారణంగా ఒక ఇల్లు కూలి 9 మంది మృతి చెందారు. రాజౌరిలో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు మృతి చెందగా, పలువురి ఆచూకీ గల్లంతయ్యింది. సహాయక బృందాలు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. హవేలీ ప్రాంతంలో ఏడు ఇళ్లు కూలిపోయాయి.
జమ్మూకశ్మీర్‌లో గత 24 గంటల్లో రియాసిలో 106 మి.మీ, రాజౌరిలో 103, ఉదంపూర్‌లో 101.6, కత్రాలో 85, పూంచ్‌లో 77, బటోటేలో 57.5 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వివరించారు. రాజౌరిలోని దర్హాలి, ఖండ్లి, సుక్తోహ్, జమెలా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దర్హాలీ నదిలో వరద ఉప్పొంగడంతో దగ్గరలో ఉన్న కొత్త బస్టాండ్‌లోకి నీరు చేరి వందలాది వాహనాలు నీటమునిగాయి. సమీపంలో లోతట్టు ప్రాంతంలో ఉన్న 50కిపైగా కుటుంబాలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. రాజౌరి ఎమ్మెల్యే ఇఫ్తకార్ అహ్మద్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అఖ్నూర్‌లో చీనాబ్ నది, పీర్ పంజాల్‌లో మనవార్ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
మరోవైపు జమ్మూకశ్మీర్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. చాలామంది యాత్రికుల వాహనాలు రహదారులపై నిలిచిపోయాయి. మరోవైపు ఆయా ప్రాంతాల్లో రెస్క్యూ, సహాయక బృందాలు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి వరదబాధితులకు సహాయక, పునరావాస చర్యలు చేపట్టారు. మరోవైపు నాగాలాండ్‌లోని మోన్ ప్రాంతంలో ఆదివారం ఉదయం కొండచరియలు విరిగిపడటంతో 15 ఇళ్లు కూలిపోయాయి. 8 మంది మృతి చెందారు.
ఎన్డీఆర్‌ఎఫ్, అసోం రైఫిల్స్, నాగాలాండ్ పోలీసు బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందగా, కొండచరియలు విరిగిపడటంతో 84 రహదారులను మూసివేశారు. కేదార్‌నాథ్ యాత్ర, కైలాస్ మానసరోవర్ లో పలువురు యాత్రికులు చిక్కుకున్నారు. పిథోర్‌గడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో బేస్ క్యాంప్ వద్ద 50 మంది యాత్రికుల బృందాన్ని నిలిపివేశారు.
డెహ్రాడూన్‌లో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. అలకనంద నది నీటిమట్టం భారీగా పెరిగి ఘాట్లు మునిగిపోయాయి. చత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో సుర్గుజా జిల్లాలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.అరుణాచల్ ప్రదేశ్‌లో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారని, 29 మంది గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లాతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఫోన్‌లో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.






