పోలింగ్‌కు సిద్ధం
లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌కు అంతా సిద్ధమయింది. పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. నాలుగో దశ పోలింగ్ జరగనున్న రాష్ట్రాల్లో తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకూ పోలింగ్ జరగనుంది. ఏపీలోని 25 లోక్‌సభ స్థానాలతోపాటు 175 అసెంబ్లీ స్థానాలకు కూడా ఒకే దశలో పోలింగ్ జరగనుంది. వీటితోసహా బీహార్‌లో అయిదు, జార్ఖండ్‌లో నాలుగు, మధ్యప్రదేశ్‌లో ఎనిమిది, మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్‌లో 13, పశ్చిమ బెంగాల్‌లో 8 స్థానాలకు, జమ్మూ కశ్మీర్‌లో ఒక స్థానానికి పోలింగ్ జరగనుంది. ఒడిశాలో నాలుగు లోక్‌సభ స్థానాలతోపాటు వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలకూ అదే రోజు ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య ప్రధానంగా త్రిముఖ పోటీ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు తర్వాత అయిదు నెలలకే జరుగుతున్న ఈ ఎన్నికల్లో మరోసారి అత్యధిక స్థానాలు గెలుచుకుని రాష్ట్రంలో పట్టును మరింతగా పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మరోవైపు ఈసారి 400కు పైగా స్థానాలతో కేంద్రంలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలనుకుంటున్న బీజేపీ దక్షిణాదిపైన, ముఖ్యంగా గతం నుంచి కూడా పట్టు ఉన్న తెలంగాణపైన ప్రత్యేక దృష్టిపెట్టింది.
ప్రధాని మోడీసహా బీజేపీ జాతీయ నాయకులు రాష్ట్రంలో వరస పర్యటనలు జరిపి విస్తృతంగా ప్రచారం సాగించారు. మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామన్న ధీమాతో ఆ పార్టీ ఉంది. మరోవైపు శాసన సభ ఎన్నికల్లో ఊహించని పరాజయంతో అధికారం కోల్పోయిన కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకుని పూర్వవైభవాన్ని పొందాలన్న పట్టుదలతో ఉంది. పార్టీ అధినేత కేసీఆర్‌సహా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులాంటి అగ్రనేతలు రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వంతోపాటు అటు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పైనా ఘాటు విమర్శలతో కేడర్‌లో జోష్ నింపారు. దీంతో మొదట్లో డీలా పడినట్లు కనిపించిన ఆ పార్టీ పోలింగ్ తేదీ దగ్గరపడే సమయానికి బాగా పుంజుకుని ప్రత్యర్థి పార్టీలు రెండింటికీ గట్టి పోటీనిస్తున్నట్లు పరిశీలకుల అంచనా. ప్రతిపార్టీ కూడా ప్రత్యర్థులైన రెండు పార్టీలపైనా దుమ్మెత్తి పోస్తూ ప్రచారం సాగించడంతో మండుటెండలకు ప్రచార వేడికూడా తోడయింది. అన్ని పార్టీల ప్రచారం అంతా కూడా రాజ్యాంగ రద్దు, మైనారిటీ రిజర్వేషన్ల అంశాలు కేంద్రంగా సాగింది.
దాదాపు నెలరోజులపాటు సాగిన ప్రచారపర్వం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఇన్ని రోజులు జనాల చెవుల్లో హోరెత్తిన మైకులు మూగబోయాయి. మిగిలిన 48 గంటల్లో ఓటింగ్ సరళి ఎలా ఉండాలనే వ్యూహరచనలో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. పొరుగు రాష్ట్రమైన ఏపీలో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతండడంతో పోటీ కూడా ‘నువ్వా నేనా’ అన్న రీతిలో ఉండడంతో హైదరాబాద్, శివారు ప్రాంతాలు, రాష్ట్ర ప్రజలు అప్పుడే ఓటు వేయడం కోసంపెద్ద సంఖ్యలో సొంతఊళ్ల బాట పట్టారు. తెలంగాణలోని మిగతా జిల్లాలకు చెందినవారు నగరం నుంచి తరలడం మొదలైంది. మూడు రోజులు సెలవులు రావడంతో బస్సులు, రైళ్లు అన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రజల ఉత్సాహం చూస్తే గతంలోకంటే పోలింగ్ శాతం బాగా పెరగొచ్చని పరిశీలకులు అంటున్నారు. ఇక, నాలుగో విడత ఎన్నికల్లో యూపీలో అఖిలేశ్ యాదవ్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి, మహువా మొయిత్రా, బీహార్‌లో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ లాంటి ప్రముఖుల భవిష్యత్తు తేలనుంది. తెలంగాణలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిసహా ఏపీ సీఎం జగన్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన నేత పవన్‌కళ్యాణ్‌ల రాజకీయ భవితవ్యంపై కూడా ఓటరు తీర్పు చెప్పనున్నాడు.






