10 May, 2026 | 10:04 AM

రోగుల సేవకే అంకితం

12-05-2024 12:05 AM

రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో నర్సులు చేసే సేవలుకూడా అంతే ముఖ్యం. మన దేశంలో వివిధ ఆసుపత్రులలో వారెందరో అసమాన సేవలు అందిస్తున్నారు. డాక్టర్ల తర్వాత ‘డాక్టర్లు’గా పేషెంట్ల విశ్వాసం పొందుతూ, ఎంతో ఓపికతో అన్ని వేళలా రోగులను కంటికి రెప్పలా చూసుకుంటారు. ఇవాళ (12 మే) ‘అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం’ సందర్భంగా వారిని గౌరవిస్తూ, అంకితభావంతోకూడిన వెలకట్టలేని వారి సేవలను మనసారా తలచుకుందాం. ‘నర్సింగ్’ వృత్తి అనగానే మనకు ఫ్లోరెన్స్ నైటింగేల్ గుర్తుకు వస్తుంది. ‘లేడీ విత్ ది లాంప్’గా పేరెన్నిక గన్న ఆ మహానుభావురాలు చేసిన సేవలు అనుపమానం. అసమానమైన ఆమె సేవలతో అప్పట్లోనే మరణించే రోగుల సంఖ్య బాగా తగ్గింది. యుద్ధంలో దెబ్బ తిన్న ప్రతి సైనికుడికి ‘తాను బతుకుతాను’ అన్న ఆశ చిగురించేది. ఎంతో గొప్పింటి మహిళ అయిన ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ పనులు చేయడానికే  నిశ్చయించుకుంది. 

ఎన్ని కష్టాలు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొన్నది. ఆ రోజుల్లోనే ఒక విధంగా సంఘం మీద తిరగబడింది. స్త్రీలు ఇంటిపట్టునే ఉండాలన్న కట్టుబాట్లను ఛేదించింది. పేదలకు, అనాథలకు సేవ చేయాలన్న అభిలాష ఫ్లోరెన్స్ నైటింగేల్‌కు పుట్టుకతోటే వచ్చి వయస్సుతోపాటు పెరిగింది. 1812 మే 12 న ఫ్లారెన్స్ ఇటలీలో పుట్టింది. తల్లి ఫానీ నైటింగేల్ చాలా అందగత్తె. ఫ్లోరెన్స్‌కన్నా పెద్దది ఒక అక్క ఉండేది. తండ్రితోపాటు అక్కాచెల్లెళ్ళు ఇద్దరు ఊర్లు తిరిగేవారు. ఆ రోజుల్లో ఆస్పత్రులు అధ్వా న్న స్థితిలో ఉండేవి. శుచి, శుభ్రత, ఏ మాత్రం ఉండేవి కావు. అయినా కూడా ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ పని చేయడానికే నిర్ణయించుకుంది. 1852లో ఐర్లాండ్ వెళ్ళింది. అక్కడి ఆసుపత్రులను చూడగానే వాటిల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావలనుకోన్నది. 

నిరుపమాన సేవలు

1853లో సిస్టర్స్ ఆఫ్ చారిటికి వెళ్ళింది. తిరిగి లండన్ వచ్చి, తన నాయనమ్మకు సేవ చేయడానికి రాగా అక్కడ కలరా వ్యాపించింది. వెంటనే ఆసుపత్రులకు వెళ్లి రోగులకు, పగలు రాత్రి అనక సేవలందించింది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చి రోగులకు మంచి ఆహారం అందించింది. 1854- లో క్రిమియాలో ఘోర యుద్ధం జరిగింది. ఫ్లారెన్స్ వచ్చి తోటి నర్సులను కూడగట్టుకొని యుద్ధంలో గాయాలైన సైనికులకు నిరుపమానమైన సేవలందించింది. వారికీ ధైర్యం చెప్పింది. సాటి నర్సులు వారిని విసుక్కునేవారు. 

చిరునవ్వుల కోసమే!

‘ఏ పనీ దొరక్క ఈ పనికి వచ్చాం’ అనేవారు. కానీ, ఎంతో ధనిక కుటుంబంలోంచి వచ్చిన ఆమె కోరి ఈ పనిని ఎంతో శ్రద్ధతో, ఇష్టంతో చేసేది. ఎంతో గుండె నిబ్బరంతో, చిమ్మ చీకట్లో కూడా చిరు దీపం వెంట తీసుకుని వెళ్లి సేవలు చేసేది. రోగుల ముఖం మీద చిరునవ్వు ఆమె చేతిలో దీపంలాగా వెలిగేది. భారతదేశానికి కూడా ఆమె ఇతోధిక సేవలు అందించింది. 1859లో విక్టోరియా రాణి ఆరోగ్య సంస్కరణల కోసం ఒక కమిషన్‌ను నియమించింది. చెన్నై నగరపు మేయర్ ఆడ నర్సులకు శిక్షణను ప్రోత్సహించారు. నగర పారిశుధ్యం మెరుగు పడింది. 1910 ఆగస్ట్ 13న ఫ్లోరెన్‌స మరణించినా సేవా నిరతిగల ప్రతి నర్సులోను ఆమె కలకాలం జీవించి ఉంటుంది. రోగులు గుర్తు ఉంచుకోవాలిసిన ఆదర్శమూర్తి ఆమె.