08-06-2025 12:00:00 AM
అమ్మాయిలకు నగలకు అవినాభావ సంబంధం ఉంటుంది. అయితే వీటిని ఎంత ఇష్టంగా ధరించినా.. వీటి తయారీలో వాడే కొన్ని లోహాలు కొంతమంది చర్మతత్వాలకు సరిపడవు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ నగల విషయంలో ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతుంటుంది. ఫలితంగా చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద, మంట.. వంటి సమస్యలొస్తాయి. మరి.. వీటి నుంచి విముక్తి పొందాలంటే కింది టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. అవేంటో చూద్దాం..
ఆర్టిఫిషియల్ నగల తయారీలో నికెల్ లోహాన్ని వాడుతుంటారు. చాలామందిలో అలర్జీ రావడానికి ఇదే ముఖ్య కారణమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా సున్నితమైన చర్మతత్వం ఉన్నవారిలో దీని కారణంగా దురద, దద్దుర్లు, ఎరుపెక్కడం.. వంటి సమస్యలొస్తాయంటున్నారు. అలాంటి వారికి ఈ చిట్కాలు మేలు చేస్తాయి.
* నగల అలర్జీ ఉన్నవారు వాటిని ధరించే ముందు మాయిశ్చరైజర్, పౌడర్, క్యాలమైన్ లోషన్స్.. వంటివి రాసుకోవాలి. ఇవి చర్మానికి కవచంలా పనిచేసి ఆయా లోహాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తాయి.
* అవుట్‌ఫిట్ ఏదైనా.. కొంతమంది మెడ దగ్గరగా ఉండే చోకర్, నెక్‌పీస్.. వంటి బిగుతుగా ఉండే జ్యువెలరీని ఎంచుకుంటారు. దీనివల్ల గాలి ఆడక కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంతవరకు వదులుగా ఉండే నెక్‌పీస్‌లు, లాంగ్ చెయిన్స్ వంటివి ఎంచుకోవాలి.
* ధరించే ముందు ట్రాన్స్‌పరెంట్ నెయిల్ పాలిష్‌ను నగలపై ఓ కోటింగ్ వేసి.. ఆపై వేసుకోవడం మంచిది. ఇది నగల్లోని లోహాల ప్రభావం చర్మంపై పడకుండా కాపాడుతుంది.
* ఆర్టిఫిషియల్ నగలే కదా అని వీటి విషయంలో చాలామంది అంత శ్రద్ధ తీసుకోరు. తడిసినా, చెమట పట్టినా.. అలాగే వాటిని బాక్సుల్లో భద్రపరుస్తుంటారు. ఆ తడిదనం వల్ల నగల నాణ్యత దెబ్బతింటుంది. ఇది కూడా చర్మ అలర్జీలకు కారణమవుతుంది. కాబట్టి నగల్ని భద్రపరిచే ముందు పూర్తిగా ఆరనివ్వడం మేలు. అలాగే తేమ అధికంగా ఉండే ప్రదేశాల్లో వీటిని భద్రపరచకూడదు.
* నగల వల్ల చర్మంపై దురదగా అనిపిస్తే.. ఆ ప్రదేశంలో కలబంద గుజ్జును అప్లు చేసుకోవాలి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు సమస్య నుంచి త్వరిత ఉపశమనం కలిగిస్తాయి.
* గోల్డ్, సిల్వర్ కోటింగ్‌తో తయారు చేసిన వాచ్‌లను ధరించడం వల్ల కొంతమందిలో రాషెస్ రావడం చూస్తుంటాం. ఇలాంటి వాళ్లు లెదర్, క్లాత్.. వంటి మెటీరియల్‌తో తయారుచేసిన వాచ్ బెల్టుల్ని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు.