కాంగ్రెస్ గూటికి అల్లోల

02-05-2024 01:40:27 AM

హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాసు మున్షీ సమక్షంలో బుధవారం ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు డాక్టర్ వెన్నెల అశోక్, సంచార కులాలకు చెందిన పలువురు నేతలు గాంధీభవన్‌లో పార్టీ కండువా కప్పుకున్నారు. అంతకు ముందు బీఆర్‌ఎస్ పార్టీకి ఇంద్రకరణ్‌రెడ్డి రాజీనామా చేశారు. ఇంద్రకరణ్‌రెడ్డి గత కొంతకాలంగా బీఆర్‌ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ను వీడుతారని ప్రచారం జరిగింది. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఇంద్రకరణ్‌రెడ్డి.. అప్పుడు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో బీఎస్పీ నుంచి నిర్మల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

అధిష్ఠానం ఆదేశం 

ఉంటేనే చేరికలు : జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకునే వారు ముందుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాసు మున్షీ ఆమోదం తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. క్షేత్ర స్థాయిలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను వీడి సొంత గూటికి వచ్చే వారిపై ఆయా నియోజక వర్గాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో  అధిష్ఠానం ఆమోదం తర్వాతనే పార్టీలోకి చేర్చుకుంటామని ఆయన తెలిపారు.