29 July, 2026 | 2:11 AM

ట్రోల్స్ చేస్తూ సమయం వృథా చేసుకోవద్దు!

29-07-2026 01:21 AM

సామాజిక మాధ్యమాల వేదికగా సినీ సెలబ్రిటీలపై విమర్శలు చేయడం, వారి లోపాలను ఎత్తిచూపడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఈ విపరీత ధోరణీని అడ్డుకునేందుకు తనదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో అల్లు అర్జున్ తన అభిమానులను కలిశారు.

ఈ సమావేశానికి భారతదేశంలోని ఏడు రాష్ట్రాల నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (ఏఏఎఫ్‌ఏ) సభ్యులు తరలివచ్చారు. వారందరితో అల్లు అర్జున్ ఆరు గంటలకుపైగా సమయాన్ని గడిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన వెయ్యి మంది ‘ఏఏఎఫ్‌ఏ’ సభ్యులకు బీమా కవరేజీని అందించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “నా అభిమానుకు, నన్ను ద్వేషించే వారికీ ఒక విషయం చెప్పాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా.

మనకు నచ్చనివాళ్ల కోసం మన డబ్బు, సమయం, శక్తి ఖర్చు పెట్టొద్దు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌పై స్పందించడం కంటే ఆ సమయాన్ని మీ సొంత ఎదుగుదల కోసం ఉపయోగించుకోండి. మీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు కూర్చోండి పర్లేదు. కనీసం అలాగైనా మీ సమయాన్ని ఆస్వాదిస్తారు కదా. ఎవరినీ ఎప్పుడూ ట్రోల్స్ చేయకండి” అని అల్లు అర్జున్ అభిమానులకు సూచించారు. బన్ని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.