ఆదర్శ కుటుంబంలో స్వర్ణగా..
విక్టరీ వెంకటేశ్ పోషించిన చిట్టిబాబు పాత్ర పరిచయానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిన నేపథ్యంలో ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ (ఏకే47) చిత్రబృందం ఆదర్శ కుటుంబంలోని మరో కీలక సభ్యురాలిని పరిచయం చేసింది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి ‘స్వర్ణ’ పాత్రలో నటిస్తున్నారు. చిట్టిబాబుకు భార్యగా, చిరునవ్వే చిరునామాగా ఉండే ఓ ఆప్యాయమైన మధ్యతరగతి ఇల్లాలిగా ఆమె పాత్ర ప్రేక్షకుల హృదయాలను హత్తుకోనుంది.
శ్రీనిధి పాత్రను పరిచయం చేస్తూ టీమ్ విడుదల చేసిన ఈ క్యారెక్టర్ గ్లింప్స్‌లో నివేదా పేతు రాజ్, హాస్య నటుడు సత్య కొన్ని క్షణాలు కనిపిస్తూ చిత్రంలోని వినోదాత్మక వాతావరణాన్ని మరింత ఆసక్తికరంగా మలిచారు. ఇక ఈ సినిమా నుంచి త్వరలోనే యువినా పార్థవిని ‘సంపూర్ణ’గా, రాజా ప్రజ్వల్‌ను ‘సర్వ’గా పరిచయం చేయనుందీ టీమ్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ వహిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా, రవి కే చంద్రన్ ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది.






