31 March, 2026 | 9:15 AM

అమ్మబోతే అడవే!

16-05-2024 01:16 AM

రాష్ట్రవ్యాప్తంగా వరి పైరును దెబ్బతీసిన అకాల వర్షం

ధాన్యపు రాశుల్లోకి చేరిన వర్షపు నీరు

ధాన్యం విక్రయించే సమయంలో రైతులకు చుక్కెదురు

నాణ్యతా ప్రమాణాల పేరుతో నిర్వాహకుల కొర్రీలు

సాకులు చెప్పి తూకాల్లో బస్తాకు కిలో చొప్పున కోత 

ప్రభుత్వ మద్దతు ధరకు మంగళం..

దోపిడీపై రైతుల ఆగ్రహం

పలు జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకోలు 

రెక్కలు ముక్కలు చేసుకుంటూ, రేయింబవళ్లు కష్టం చేస్తూ, పంట పండిస్తున్న రైతులకు అడుగడుగునా గండాలే. విత్తనాలు నాటిన నాటి నుంచి దిగుబడి వచ్చి అమ్ముకునే వరకు వ్యవసాయం జూదమే. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షాలకు కొన్నిచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన వడ్లను ఆరబెట్టుకుని, తీరా కేంద్రాలకు తీసుకెళితే ధాన్యం సేకరణ కేంద్రాల నిర్వాహకులు కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. దీంతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా రైతులు రోడ్డెక్కారు. తాము పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాల్సిందేనని రోడ్లపై బైఠాయించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని రాస్తారోకో చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రైతులు వేలాది రూపాయలు వెచ్చించి, కోతలు కోయించి, రవాణా చార్జీలు చెల్లించి, అనేక ప్రయాసల కోర్చి కేంద్రాలకు తీసుకెళితే అక్కడ వారికి చుక్కెదురవుతున్నది. కేంద్రాల ఆవరణలో నిర్వాహకులు ప్యాడీ క్లీనింగ్ చేయించకపోవడంతో అక్కడ ఆరబోసిన ధాన్యంలోకి తేమ చేరుతున్నది. దీంతో మిల్లర్లు తేమ, తాలు సాకు చూపి ఒక్కో బస్తాపై అదనంగా కిలో తరుగు తీస్తున్నారు. కొన్నిచోట్ల ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి మోసపోతున్నారు.