రుణమాఫీకి నిధులెట్ల
రుణ సేకరణ మార్గాలు అణ్వేషించండి
భారీగా రుణమిచ్చే బ్యాంకర్లను వెదకండి
అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా మాఫీ
పంద్రాగస్టులోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే
వర్షాకాలం రాకముందే ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలి
విభజన సమస్యల పరిష్కారానికి చర్యలు
18వ తేదీన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం
సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): ఎన్నికల హామీ మేరకు ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు రూ.౨ లక్షల పంట రుణమాఫీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వర్షాకాలం రాకముందే కల్లాల్లోని రైతుల ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌తో అపరిష్కృతంగా ఉన్న వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకొనేందుకు మార్గాలను అణ్వేషించాలని కోరారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు ఇతర అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ర్ట ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించే మార్గాలపై అధికారులతో చర్చించారు. రుణమాఫీకి సంబంధించి విధివిధానాలు సిద్ధంచేయాలని ఆదేశించారు. అవసర మైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి రుణమాఫీకి నిధులను సర్దుబాటు చేయాలని సూచించారు. భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని కోరారు.
రైతు రుణమాఫీకి సంబంధించి మహారాష్ర్ట, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరిం చిన విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, దళారుల జోక్యం లేకుండా చూడాలని స్పష్టంచేశారు. రైతు నుంచి ధాన్యం కొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. తడిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని కోరారు. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై ఉక్కు పాదం మోపాలని ఆదేశించారు.
విభజన సమస్యలపై దృష్టి
రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఉన్న వివాదాలను త్వరగా పరిష్కరించుకొనే మార్గాలను అణ్వేషించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఉద్యోగుల సర్దుబాటు, ఆస్తులు, అప్పుల పంపిణీ తదితర అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని సూచించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల విభజన ఇంకా పూర్తి కాలేదు. మరికొన్ని అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్తు సంస్థల బకాయిలు ఇంకా తేలలేదు.
ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలను అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీల వంటి అంశాలు ముందుగా పూర్తిచేయాలని ఆదేశించారు. పీటముడి పడిన అంశాల్లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఉమ్మడి ఏపీ విభజన పూర్తయ్యి జూన్ ౨వ తేదీకి పదేండ్లు పూర్తవుతుంది. ఆ తేదీతో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగుస్తుంది.
హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధానిగా మారనుంది. ఈ పదేండ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత స్వాధీ నం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకున్న అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని సూచించారు.
సమీక్షా సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బీసీ గురుకులాలకు 187 కోట్లు విడుదల
బీసీ గురుకులాలకు రూ.187.13 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో మొదటి త్రైమాసికానికి సంబంధించిన నిధులను రిలీజ్ చేసింది. ఇందుకోసం రెండు జీవోలు జారీచేసింది. ఒక జీవో కింద రూ.119.59 కోట్లు, రెండో జీవో కింద రూ.67.54 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయాలైన రెసిడెన్సియల్ హైస్కూళ్లు, జూనియర్ కాలేజీల అవసరాల నిమిత్తం ఈ నిధులను వినియోగించనున్నారు.
18న క్యాబినెట్ బేటీ
ఈ నెల 18వ తేదీన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఆ సమావేశంలో రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక చర్చిస్తారని సమాచారం.




