తునికాకు పండుగొచ్చె
ముత్తారంలో పల్లెల్లో కల్లాల జోరు
అడవి బిడ్డలకు చేతినిండా పని
మంథని, మే15 (విజయక్రాంతి): వేసవి కాలం.. కోడి కూతతో లేచి.. గరం గరం చాయ్ తాగి.. అడవి బాట పట్టే పండుగొచ్చింది.. పల్లె పల్లెనా తునికాకు సంబురం మొదలైంది. ముత్తారం మండలంలో ఇటీవల తునికాకు కల్లాలు ప్రారంభ మయ్యాయి. తునికాకు సేకరణతో గ్రామీణ ప్రజలకు చేతినిండా పని దొరుకుతుంది. ఏటా వేసవిలో అడవుల్లో లభించే తునికాకు సేకరణ తో గ్రామీణ ప్రజలు ఉపాధి పొందుతుంటా రు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది సంచులు చేతబట్టి వేకువ జామునే అడవి బాట పడతారు. అడవుల్లో విరివిగా లభించే తునికాకును తెంపుకొని ఎండ పడకముందే ఇంటి బాట పడుతుంటారు. వంద ఆకుల కట్ట, యాభై ఆకుల కట్ట లెక్కన కట్టగట్టి సాయంకాలం గ్రామ శివారులోని కల్లా ల వద్దకు చేరుకుంటారు. అక్కడ సిబ్బంది తునికాకు కట్టలను లెక్కగట్టి క్రమపద్ధతిలో పేర్చు తుంటారు. తునికాకు సేకరణ పూర్తయ్యాక.. కట్టల లెక్క చొప్పున వేతనాలు చెల్లిస్తారు. ముత్తారం మండలంలోని అడవిశ్రీరాంపూర్, కేశనపల్లి, దర్యాపూర్, హరిపు రం, మైదంబండ, మచ్చుపేట, పారుపల్లిల్లో ఈ నెల ౧౪న మొదలు పెట్టారు. తునికాకు సేకరణ ప్రారంబం కావడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.




