ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముత్యంపేట, రాఘవపేట గ్రామాల్లో పాల్గొనగా, మల్లాపూర్‌లో ఎస్సై అనిల్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కులవివక్ష, అంటరానితనాన్ని ఎదుర్కొని ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే స్థాయికి ఎదిగిన మహనీయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలవడానికి ఆయన రచించిన రాజ్యాంగమే కారణమని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనే ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.






