అధికార మదంతో చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారా..?
బీజేపీ నేత కుమారుడిని వెంటనే అరెస్టు చేయకపోతే ప్రజా తిరుగుబాటు
మండిపడ్డ అంబేద్కర్ సేవా సంఘం నాయకులు
ఖమ్మం,(విజయక్రాంతి): 17 ఏళ్ల మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరత్ ను ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం అధికార అహంకారానికి నిదర్శనమని ఎస్సీ, ఎస్టీ, బీసీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా సంఘం వ్యవస్థాపకులు జై భీమ్ నారమళ్ళ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సామాన్య పేద కుటుంబానికి చెందిన యువకుడిపై ఇలాంటి ఆరోపణలు వచ్చి ఉంటే పోలీసులు అర్ధరాత్రే ఇళ్లలోకి దూసుకెళ్లి ఈడ్చుకెళ్లేవారని, కానీ అధికార పార్టీ నేత కుమారుడు కావడంతో చట్టం చేతులు కట్టుకుని చూస్తోందని ఆరోపించారు.
దేశానికి చట్టాలు చెప్పే వాళ్లే తమ కుటుంబ సభ్యుల విషయంలో మాత్రం చట్టాలను పక్కన పెట్టి అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్ బాలికల రక్షణ గురించి సభల్లో గొప్పలు చెప్పే నాయకులు, తమ ఇంటి ముందు జరిగిన ఘటనపై మాత్రం నోరు విప్పకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజల పన్నులతో జీతాలు తీసుకునే పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి న్యాయాన్ని ఖూనీ చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
మద్యం మత్తులో విద్యార్థులపై వేధింపులు, దౌర్జన్యాలు, రౌడీయిజం చేస్తూ తిరిగే వ్యక్తిని కాపాడటం అంటే సమాజానికి ప్రమాదాన్ని పెంచడమేనని మండిపడ్డారు. బాధితురాలికి పూర్తి రక్షణ కల్పించి నిందితుడిని వెంటనే నిర్బంధానికి పంపకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు. మహిళల భద్రతపై మాటలు చెప్పే పాలకులు ముందుగా తమ ఇళ్లలో జరిగిన దారుణాలపై సమాధానం చెప్పాలని, లేదంటే ప్రజల కోపాగ్నికి గురికాక తప్పదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.






