06-12-2025 10:03:25 PM
బీసీ సాధికారిత సంఘం నేతలు - ఘన నివాళులు..
వేములవాడ (విజయక్రాంతి): భారత స్వాతంత్ర సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ వర్ధంతి సందర్భంగా బీసీ సాధికారిత సంఘం తరఫున ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొండ దేవయ్యపటేల్, ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు పొలాస నరేందర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ న్యాయశాస్త్రజ్ఞుడు, ఆర్థికవేత్త, కేంద్ర కార్మిక, న్యాయశాఖ మంత్రిగా దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
దళితులు, బడుగు–బలహీన వర్గాల విద్య, ఉపాధి, రాజకీయ హక్కుల సాధన కోసం ఆయన చేసిన కృషి అపారమన్నారు. వేములవాడలోని సంఘం కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అట్టడుగు వర్గాల సామాజిక–ఆర్థిక పురోగతికి ఆయన చూపిన మార్గంలో ప్రభుత్వాలు కొనసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉయ్యాల భూమయ్య, కనపర్తి హమ్మాండ్లు, చింతలకోటి రామస్వామి గౌడ్, బుర్ర దశ గౌడ్, కాసర్ల శ్రీనివాస్, గోగికారి రాజు, గోగికారి రాజేష్, నాయి బ్రాహ్మణ రాజు తదితరులు పాల్గొన్నారు.