11 March, 2026 | 11:44 AM

తప్పుడు నంబర్ ప్లేట్‌తో తిరుగుతున్న డీసీఎం పట్టివేత

11-03-2026 10:13 AM

భిక్కనూర్,(విజయక్రాంతి): తప్పుడు నంబర్ ప్లేట్‌తో తిరుగుతున్న డీసీఎంను బిక్నూర్ పోలీసులు(Bhiknoor Police) పట్టుకున్నారు. మంగళవారం ఉదయం టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో చెట్ల ఆకులు, కొమ్మలతో నంబర్ ప్లేట్‌ను కప్పి హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న డీసీఎంను పోలీసులు అనుమానంతో ఆపి తనిఖీ చేశారు. వాహనంపై టీఎస్ 21 యూడి 4521 నంబర్ ప్లేట్ ఉండగా, పోలీసుల ట్యాబ్‌లో చెక్ చేయగా ఎలాంటి వాహన సమాచారం రాలేదు.

దీంతో డ్రైవర్‌ను ఆర్‌సీ పత్రాలు చూపించాలని కోరగా, అసలు నంబర్ టీఎస్ 12 యూడి 4521గా ఉన్నట్లు గుర్తించారు.చలాన్ల నుంచి తప్పించుకోవడానికి నంబర్ ప్లేట్‌ను మార్చి వాహనం నడుపుతున్నట్లు డ్రైవర్ గౌస్ పాషా (తండ్రి ఫక్రుద్దీన్), కోనాపూర్ గ్రామం, బాన్సువాడ మండలానికి చెందిన వ్యక్తి అంగీకరించాడు. హెడ్ కానిస్టేబుల్ మలావత్ అంబర్ సింగ్ ఫిర్యాదు మేరకు బిక్నూర్ ఎస్ ఐ డి. ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.