calender_icon.png 30 September, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ

30-09-2025 02:36:48 AM

  1. ప్రకృతితో మానవ అనుబంధాన్ని గుర్తుచేసే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ
  2. డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్. 

మరిపెడ సెప్టెంబర్ 29, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల మున్సిపాలిటీ కేంద్రం మండల పరిషత్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి నవరాత్రి మహోత్సవంలో భాగంగా సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ఆడపడుచులతో కోలాటం ఆడటం జరిగింది. ప్రపంచం లోనే ఎక్కడా లేని విధంగా ప్రకృతిని ఆరాధించే అతిపెద్ద పండుగ బతుకమ్మ అని  డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు డాక్టర్ రామచంద్రనాయక్ అన్నారు.

ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న  డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ పాల్గొనీ పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయం లో భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని గుర్తుచేసే వినూత్నమైన పండుగ బతుకమ్మ అని అన్నారు.  మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం మొదలైన అంశాలన్నింటినీ పాట రూపంలో ఆలపించే అద్భుత ఘట్టం బతుకమ్మ సొంతమని అన్నారు.

ఈ పండుగ ఎలా మొదలైందో చెప్పడానికి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ బతుకమ్మ అంటే తెలంగాణ అస్తిత్వం అనడంలో మాత్రం అతిశయోక్తి లేదని అన్నారు. అనంతరం బతుకమ్మ వేడుకలో పాల్గొన్న మహిళలకు పసుపు కుంకుమలతో పాటు చీరలను వాయినంగా అందజేశారు.

తన ఆహ్వానాన్ని మన్నించి పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీర్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు తాజుద్దీన్, జిల్లా నాయకులు మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

వాజేడు..

వాజేడు సెప్టెంబర్ 29 (విజయ క్రాంతి): ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమూరు గ్రామపంచాయతీ పరిధిలో గల గణపురం మొట్లగూడెం, గణపురం కాలనీ, కొప్పుసూరు కాలనీ, కొప్పుసూరులో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఎంగిలిపూల బతుకమ్మ తో మొదలై 9వ రోజు సద్దుల బతుకమ్మతో పూర్తవుతుంది.

ఈ సద్దుల బతుకమ్మ రోజు ప్రత్యేకమైన భక్తిశ్రద్ధలతో ఆటపాటలతో అలరిస్తూ బతుకమ్మను గంగమ్మ ఒడికి చేరుస్తారు. కాగా మొట్ల గూడెం గ్రామంలో ఆదివారం సాయంత్రం మొదలైన సద్దుల బతుకమ్మ సంబరాలు సోమవారం 11 గంటల వరకు గిరిజన నృత్యాలతో పల్లె ప్రజలు ఆనందంలో మునిగితేలారు. చివరిగా సద్దుల బతుకమ్మ ను సాగనంపే సమయంలో శివశక్తుల పూనకాలు రావటం గమనార్హం.

తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యం బతుకమ్మ

మంగపేట స్టెప్టెంబర్29 (విజయక్రాంతి): తొమ్మిది అంతరలుగా పేర్చిన సద్దుల బతుకమ్మ చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. రంగురంగుల పూలతో సంబరమంతా తనదే అన్నట్టు ఉంటుంది. బతుకమ్మకు పోటీగా ప్రతి ఇంటి ఆడబిడ్డ ఎంతో అందంగా తయారయ్యి చెట్టులో పువ్వంత హాయిగా నవ్వుతూ సంతోషంగా ఉంటారు.ఇదంతా ఒక ఎత్తు అయితే సద్దుల బతుకమ్మ సాయంత్రం ఒక ఎత్తు. ఆ రోజే బతుకమ్మ ముగింపు.

బతుకమ్మ మీద కొలువైన గౌరమ్మను ఆ తల్లి గంగమ్మ ఒడిలో వదిలిపెట్టి మళ్ళీ ఏడాది వరకు బతుకమ్మ కోసం ఎదురుచూస్తారు. సాయంత్రం ఆడపిల్లలు, ఆడవారు అందరూ ఇంతెత్తున పేర్చిన బతుకమ్మను తీసుకుని ఊరు మధ్యలో చేరి పెద్ద పెద్ద బతుకమ్మల చుట్టూ చేరి గుండ్రంగా తిరుగుతూ, జానపద పాటలు పాడతారు, ఆడతారు.చీకటి పడేవరకు ఆడి పాడి,ఆ తరువాత బతుకమ్మలను ఎత్తుకుని ఊరేగుతూ వెళ్ళి బతుకమ్మను గంగమ్మ ఒడికి చేరుస్తారు.

ఆ తరువాత రొట్టె,చెక్కెరతో తయారు చేసిన నైవేద్యంను అందరికి పంచి తాము తిని, ఇంటికి వెళ్లి ఇంటిల్లిపాదికి పంచిపెడతారు. దాంతో సద్దుల బతుకమ్మతో పాటు బతుకమ్మ పండుగ ముగుస్తుంది. తొమ్మిదిరోజు బతుకమ్మలు వదిలిన నీటి ప్రాంతాలన్నీ పూలతో నిండిపోయి కొత్త చీర కట్టుకున్న గంగమ్మలా కనువిందు చేస్తాయి. ప్రతీ ఇంటిలోనూ అందరి ముఖాలు కళకళలాడతాయి ఆనందం వెల్లివిరుస్తుంది.