5 August, 2026 | 10:01 PM

అటవీ ప్రాంత ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలి

05-08-2026 08:58 PM

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మెరుగైన రవాణా, మౌలిక వసతులు, ప్రభుత్వ సంక్షేమ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి (డి.ఎల్.సి) ప్రత్యేక సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలోని అటవీ, గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన రహదారులు, రవాణా సౌకర్యాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాప్రయోజన ప్రాజెక్టుల అమలులో అటవీ శాఖ అధికారులు పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు.

నాణ్యమైన రహదారులు, మెరుగైన మౌలిక వసతుల ద్వారా అటవీ గ్రామాలు జిల్లా, మండల కేంద్రాలతో అనుసంధానమై ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు. మైసంపేట పునరావాస గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు.

గ్రామంలో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు తదితర మౌలిక సదుపాయాల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, జిల్లా అటవీ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఆర్డీఓ దేవిదాస్, డీటీడీఓ నిహారిక, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, అటవీ, రెవెన్యూ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.