అమిత్ షా నిజామాబాద్ ప్రజలను మోసగిస్తున్నారు
గతంలో ఇచ్చిన హామీలనే మళ్లీ ప్రకటిస్తున్నారు
తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్
నిజామాబాద్, మే 6 (విజయక్రాంతి): కేంద్ర హోం మంత్రి అమిత్ షా పసుపుబోర్డు, ఈఎస్‌ఐ ఆసుపత్రి విషయంలో చెప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ చెబుతూ మోసం చేస్తున్నారని తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ ఆరోపించారు. సోమవారం నిజామాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల క్రితమే ఎన్నికల ప్రచారంలో పసుపు బోర్డు తీసుకొస్తామని, బీడీ కార్మికులకు ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన అమిత్ షా, ఇప్పుడు మరోసారి అవే హామీలు ఇచ్చి నిజామాబాద్ ప్రజను మోసం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ కులగణనను వ్యతిరేకిస్తూ, రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కులగణన జరిపేందుకు హామీ ఇస్తూ రిజర్వేషన్ల పరిమితి పెంచేందుకు చర్యలు తీసుకోనుందని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశ వేణు, నాయకులు జావీద్ అక్రం, నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.




