గంజాయి గుప్పుగుప్పు!
ఓరుగల్లులో విచ్చలవిడిగా అమ్మకాలు
యువత, విద్యార్థులే లక్ష్యంగా మార్కెటింగ్
రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు అడ్డాగా దందా
తరుచూ పోలీసులకు చిక్కుతున్న అమ్మకందారులు
వరంగల్ మహానగరంలోని గంజాయి దందా ఆందోళన కలిగిస్తోంది. జనావాస కేంద్రాలే అడ్డాగా అమ్మకాలు సాగుతున్న తీరు భయం గొలుపుతోంది. జనాలు పోగయ్యే ప్రాంతాలు, పనుల కోసం కార్మికులు ఎదురు చూసే అడ్డాలు, కళాశాలల విద్యార్థులు ఎక్కువ సమయం గడిపే ప్రదేశాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు స్థావరాలుగా వ్యాపారం సాగుతోంది. మత్తుకు అలవాటుపడిన వారు చిత్తయి పోతుండగా, అమ్మకం రుచి మరిగిన వారు కోట్లకు పడగలెత్తుతున్నారు.
వరంగల్, మే 6 (విజయక్రాంతి): వరంగల్ కేంద్రంగా గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. రైల్వేస్టేషన్ పరిసరాలు, వరంగల్ బస్టాండ్ ఏరియా, శివనగర్, చింతల్ బ్రిడ్జి సమీపంలో, ఎంజీఎం చుట్టు పక్కల ప్రాంతాలు, నర్సంపేట రోడ్డు, పాతబీటు బజార్ ఏరియాల్లో అమ్మకాలు అడ్డూ అదుపు లేకుండా నడుస్తున్నాయి. ముఖ్యంగా పొద్దు తల్లికడుపులోకి వెళ్లిందంటే చాలు ‘మత్తు’ వ్యాపారులు నిద్రలేచి స్వైరవిహారం చేస్తున్నారంటే అతిశ యోక్తి కాదు. పొద్దంతా కాయకష్టం చేసిన కూలీలు మొదలు చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకొని దేశం తలరాత మార్చే శక్తియుక్తులున్న యువత కూడా ఈ వ్యసనపు మహమ్మారికి చిక్కి విలవిలలాడుతున్నారు. రాత్రి అయితే చాలు ఆయా ప్రాంతాలు కొన్ని ప్రత్యేక సంజ్ఞలతో విచిత్ర ప్రవర్తనకారులతో కనిపిస్తున్నాయి. రోడ్లకు ఇరువైపుల ఎవరికి వారుగా నిలబడి ప్రత్యేక కోడ్‌లో మాట్లాడుకుంటూ పని పూర్తి చేసుకుంటూ ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్తుంటారు.
విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు
ఒకప్పుడు చాటుమాటు వ్యవహారంగా, గుట్టుచప్పుడు కాకుండా సాగిన గంజాయి అమ్మకాలు ఇప్పుడు విచ్చలవిడిగా మారా యి. ఎక్కడికక్కడ అమ్మకందారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్టణం తదితర ప్రాంతాల నుంచి భద్రాచలం మీదుగా రవాణా చేస్తూ వరంగల్ నగరానికి చేరవేస్తున్నారు. రైల్వేస్టేషన్ పరిసరాల్లోని కొన్ని అడ్డాల్లో ఎక్కడికక్కడ పంపకాలు చేసి, అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు చేర వేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడో ఏదో అపశ్రుతి జరిగి దొరికితే దొరినట్టు.. లేదంటే రవాణాదారులకు ఇక ఎదురేలేదన్నట్టుగా దందా సాగుతోంది. కళాశాల క్యాంపస్లు, హాస్టళ్లు, లాడ్జీలు, వైన్స్ సెంటర్లలో అమ్మకాలు ఎక్కువగా జరిగేలా చూసుకుంటూ లక్షల్లో సంపాదిస్తున్నారు.
తరుచూ పట్టుబడుతున్న వైనం
వరంగల్ మహానగరంలో తరుచూ గంజాయి అమ్మకందారులు పట్టుబడటం, సేవించి పోలీసులకు చిక్కిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ మధ్య కాలంలో రోజూ ఏదో ఒక చోట గంజాయి కేసులు వెలుగు చూస్తుంటే నగరంలో అమ్మకాలు ఎంతగా పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. యువత, విద్యార్థులే లక్ష్యంగా మార్కెటింగ్ చేస్తున్న ముఠాలు కాసుల వేటకు బలిచేస్తున్నాయి. నగరంలోని పలు ఆటో సెంటర్లలో గంజాయికి చిరునామాలు తెలిపే బ్యాచ్ లు ఉన్నట్టు వస్తున్న ఆరోపణలు కూడా ఆందోళన కలిగించే విషయమే. పోలీసులు ఎంతగా అప్రమత్తమై నిఘా పెంచినా చాపకింద నీరులా వ్యాపారం విస్తరిస్తూనే ఉంది. మనకెందుకులే అనుకునే విధానానికి స్వస్తి చెప్పి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుంటే ‘మత్తు’ను అదుపు చేయడం అంత కష్టమేమి కాదు. గంజాయితోపాటు ఇతరాత్ర మత్తు పదార్థాల అమ్మకాలపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, మనవంతుగా అందరం జాగరుకతతో మెదిలితే దందాకు అడ్డుకట్ట వేసేందుకు సహకరించిన వారమవుతాం. ఈ నెల 4న నగరంలో రెండు వేర్వేరు చోట్ల గంజాయి పోలీసులకు పట్టుబడటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది.
చిత్తవుతున్న బంగారు ప్రాయం..
ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువత గంజాయికి బానిసలై జీవితాన్ని నాశనం చేసు కుంటున్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఉన్నత విద్యాబుద్ధులు చెప్పించి తమ కష్టాలను పెట్టుబడిగా పెట్టి పెంచుతున్నా.. యువత వ్యసనానికి మరిగి కలల సౌధాలను కూల్చుతున్నారు. నిత్యం అది లేకుండా ఇక ఉండలేమన్నంతగా అడిక్ట్ అయిపోయి కెరీర్‌ను కోల్పోతున్నారు. రాత్రి అయిందంటే చాలు కంబైన్డ్ స్టడీస్ అని చెప్తూ బ్యాచులుగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్లకు పరుగులు తీస్తున్నారు. గంజా యి మత్తులో హద్దుమీరిన రైడింగ్ లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుని తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తున్నారు.




