అయోధ్య పూర్తి కాకుండానే ప్రారంభించారు
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ
కరీనగర్, మే 6 (విజయ క్రాంతి): ఎన్నికలు అపశకునంలో ప్రారంభమయ్యాయి.. అయో ధ్య దేవాలయం పూర్తి కాకుండానే ఎన్నికల కోసం ప్రారంభించారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. సోమవారం కరీంనగర్‌లోని బద్ధం ఎల్లారెడ్డి భవన్‌లో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆగమనశాస్త్రం ప్రకారం గుడి పూర్తయిన తర్వాతనే ప్రారంభించాలి.. ఎన్నికల్లో కలిసి వస్తాయని అనుకున్నప్పటికీ రాలేదు, మోదీ రెండు విడతల్లో డూప్లికేట్ అని తేలిపోయిందని విమర్శించారు. రెండో విడతలో ఉత్తర భారతదేశంలో ఓడిపోతామని తెలియగానే మంగళసూత్రం పేరుతో ఎన్నికల్లో రాజకీయం చేస్తు న్నారని ఆరోపించారు. ప్రధాని హోదాలో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తి ఆ రాజ్యాంగంపై ప్రమాణం చేసి దాని ఉనికికే ప్రమా దకరంగా మారుతున్నాడని దుయ్యబట్టారు. పదేండ్లలో బ్యాంకులు ఎగవేసిన రుణాలు 1.75 లక్షల కోట్లకు పెరిగిందని ఆరోపించారు. 29 మంది గుజరాతీలు వేల కోట్లు ఎగవేశారని విరుచుకుపడ్డారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనని, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండటం విడ్డూరమన్నారు. సమావేశం లో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు కలవేన శంకర్, పలు జిల్లాల కార్యదర్శులు మర్రి వెంకటస్వామి, మంద పవన్, గుంటి వేణు, తాండ్ర సదానందం తదితరులు పాల్గొన్నారు.




