శ్వేత విప్లవం 2.0
- అమూల్ డెయిరీ ప్లాంట్‌తో మహిళలు, యువతకు ఉపాధి
- 400 కోట్లతో 18 నెలల్లో నిర్మాణం పూర్తి రైతులకు అదనపు ఆదాయం
- 2029 నాటికి దేశవ్యాప్తంగా 75 వేల కొత్త పాడి సహకార సంఘాలు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
- గ్రామీణ ప్రాంతాల వెన్నెముక పాల డెయిరీ: మంత్రి శ్రీధర్‌బాబు
- మెదక్ జిల్లా తూప్రాన్‌లో అమూల్ (సాబర్) డెయిరీ ప్లాంట్‌కు భూమిపూజ
మెదక్/తూప్రాన్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): సహకార వ్యవస్థతోనే రైతుల ఆర్థిక అభ్యున్నతి సాధ్యమని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తెలంగాణలో శ్వేత విప్లవం 2.0 ను ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి (Minister Kishan Reddy)పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా తూప్రాన్‌లో సుమారు రూ. 400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న అమూల్ (సాబర్) అత్యాధునిక డెయిరీ ప్లాంట్‌కు ఆదివారం ఆయన భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్లాంట్ కేవలం పారిశ్రామిక ప్రాజెక్టు మాత్రమే కాదని, తెలంగాణ పాడి రైతుల ఆర్థిక భవిష్యత్తుకు దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాబోయే 18 నెలల్లో ప్లాంట్ నిర్మాణం పూర్తిచేసి, స్థానిక మహిళలు, యువతకు ఉపాధి కల్పించడంతోపాటు పాడి రైతులకు అదనపు ఆదాయం సమకూర్చడమే లక్ష్యమన్నారు. రైతులు ఉత్పత్తి చేసిన పాలకు సరైన మార్కెటింగ్ సదుపాయా లు లేకపోవడం,
నిల్వ, ప్రాసెసింగ్, బ్రాం డింగ్ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో ఆశించిన ఆదాయం పొందలేక పోతున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. తూప్రా న్ డెయిరీ ద్వారా పరిసరాల రైతుల నుంచి పాలు సేకరించి ఇక్కడే ప్రాసెసింగ్ చేయడంతోపాటు పాలు, పెరుగు, మజ్జిగ, లస్సీ, పన్నీర్, ఐస్‌క్రీమ్, నెయ్యి వంటి ఉత్పత్తులను తయారు చేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల పాలకు విలువ జోడింపుతో రైతులకు మెరుగైన ధర లభించడంతోపాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
వ్యవసాయం అంటే వరి, పత్తి, మిర్చి పంటలే కాకుండా భూమి ఉన్నా లేకపోయినా పశుపోషణ ద్వారా జీవనోపాధి పొందవచ్చన్నారు. చిన్న, సన్నకారు రైతులకు పాడి పరిశ్రమ అదనపు ఆదాయ వనరుగా మారుతుందని పేర్కొన్నారు.
సహకారంతో దళారుల దోపిడీకి అడ్డుకట్ట..
రైతులంతా విడివిడిగా కాకుండా సహకార సంఘాలుగా ఏర్పడి సమష్టిగా పనిచేస్తే బలమైన ఆర్థిక శక్తిగా ఎదగవచ్చని అన్నారు. సహకార సంఘాల్లో రాజకీయ జోక్యం పెరగడంతో అవి నిర్వీర్యమయ్యాయని, వాటిని తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు.
రైతులే సహకార వ్యవస్థలో భాగస్వాములైతే దళారుల దోపిడీ, అవినీతి, రాజకీయ నాయకుల పెత్తనం తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. సహకార ఉద్యమం కేవలం వ్యాపార నమూనా కాదని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రజా ఉద్యమమని పేర్కొన్నారు. గుజరాత్, మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోనూ సహకార వ్యవస్థను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
అమూల్ విజయమే రైతుల విజయం..
సహకార వ్యవస్థతో ఎలాంటి మార్పు సాధ్యమో సాబర్ డెయిరీ ప్రయాణమే నిదర్శనమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 1964లో 19 సహకార సంఘాలతో రోజుకు 5,100 లీటర్ల పాల సేకరణతో ప్రారంభమైన సాబర్ డెయిరీ నేడు రోజుకు సుమారు 50 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ స్థాయికి చేరిందన్నారు. సుమారు 50 వేల మంది పాల ఉత్పత్తిదారులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారని, 2025-26లో రూ.10,500 కోట్ల వార్షిక టర్నోవర్ సాధించిందని తెలిపారు.
అమూల్ సహకార నెట్వర్క్ ద్వారా ఏటా సుమారు 25 లక్షల మెట్రిక్ టన్నుల పశువుల దాణాను రైతులకు అందిస్తున్నారని, పశువైద్య సేవలను రైతుల ఇళ్ల వద్దకే తీసుకెళ్తున్నారని వివరించారు. దేశవ్యాప్తంగా సుమారు 30 లక్షల రిటైల్ ఔట్లెట్ల ద్వారా అమూల్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, 50కి పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అమూల్ సాధిస్తున్న గుర్తింపు భారత రైతుల విజయానికి నిదర్శనమన్నారు.
2029 నాటికి 75 వేల కొత్త సంఘాలు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకార శాఖను ఏర్పాటు చేసి సహకార రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారని కిషన్‌రెడ్డి అన్నారు. శ్వేత విప్లవం 2.0లో భాగంగా 2029 నాటికి దేశవ్యాప్తంగా 75 వేల కొత్త పాడి సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
తెలంగాణలోనూ 1,525 కొత్త సహకార సంఘాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా లభించే రూ.20 లక్షల వరకు రుణాలను సద్వినియోగం చేసుకొని పశువులను కొనుగోలు చేయడం, పాల ఉత్పత్తిని పెంచడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు.
రైతు బలపడితే దేశం బలపడుతుంది..
ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తి చేస్తున్న దేశంగా భారత్ నిలిచిందని, ప్రపంచ పాల ఉత్పత్తిలో దాదాపు నాలుగో వంతు వాటా భారత్‌దేనని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. హరిత విప్లవం వ్యవసాయ రంగానికి, నీలి విప్లవం మత్స్య రంగానికి కొత్త శక్తినిచ్చినట్లే శ్వేత విప్లవం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో సహకార రంగం కీలక స్తంభంగా నిలవాలన్నదే లక్ష్యమని తెలిపారు.
శ్వేత విప్లవం 2.0 ద్వారా రైతులకు అదనపు ఆదాయం, యువతకు ఉపాధి, మహిళలకు ఆర్థిక స్వావలంబన, గ్రామాలకు ఆర్థిక పరిపుష్టి చేకూరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ పాడి రైతులు సహకార ఉద్యమంలో భాగస్వాములై రాష్ట్రాన్ని శ్వేత విప్లవంలో ముందంజలో నిలపాలని పిలుపునిచ్చారు.
మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఈ ప్లాంట్ వల్ల సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం కింద నాణ్యమైన పాలు పాఠశాల విద్యార్థులకు అందచేయవచ్చని, రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మందికి నాణ్యమైన పాలు బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అందిస్తున్న వివరించారు. అమూల్ ప్లాంటును చెన్నూరులో ఏర్పాటు చేయాలని , చెన్నూరు పరిసర ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలో కూడా మంచి మార్కెటింగ్ ఉంటుందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల వెన్నెముక పాల డెయిరీ: మంత్రి శ్రీధర్‌బాబు
ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల వెన్నెముక పాల డెయిరీ అన్నారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అనేక పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. అమూల్ ప్లాంట్ ద్వారా స్థానిక యువతకు ఉద్యోగాలతో పాటు గ్రామీణ రైతుల ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని తెలిపారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపం మెదక్ జిల్లా అన్నారు.
వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను మెదక్ జిల్లాకు పరిచయం చేయాలని తూప్రాన్ లో అముల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సాబర్ డెయిరీ చైర్మన్ శ్యామ్ లాల్ జి పటేల్, కో ఆపరేటివ్ కమిషనర్ రాహుల్ రాజ్, కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.