calender_icon.png 25 December, 2025 | 1:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంకటాపురంలో ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం

25-12-2025 12:00:00 AM

రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు

వెంకటాపురం(నూగూరు), డిసెంబర్ 24( విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ప్రజలకు ఎంతో అవసరమైన నూతన ఆధార్ సేవా కేంద్రం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. వెంకటాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ సేవలు పొందాలంటే ఆధార్ తప్పనిసరి అన్నారు. ఇకపై వెంకటాపురం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఆధార్ నమోదు, అప్డేట్ సేవలు పొందవచ్చు అని తెలిపారు.

ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ మాట్లాడుతూ, ఇప్పటివరకు ఒక్క ఆధార్ కేంద్రంపైనే మండల ప్రజలు ఆధారపడాల్సి వచ్చేదని, దీంతో బయోమెట్రిక్, అడ్రస్, మొబైల్ నెంబర్ అప్డేట్లకు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేదని చెప్పారు.ప్రజల సమస్యలను గుర్తించి నూతన ఆధార్ సేవా కేంద్రం మంజూరు చేయడంలో కృషి చేసిన ములుగు జిల్లా కలెక్టర్కు, ఈఎస్డీ (మీసేవ) కమిషనర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఆధార్ సేవా కేంద్రంలో UIDAI మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, రేట్ చార్ట్ ప్రకారం మాత్రమే రుసుములు వసూలు చేయాలని దేవేందర్ స్పష్టం చేశారు. అధిక రుసుములు వసూలు చేస్తే 1947 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. అనంతరం ఆధార్ కేంద్రం నిర్వాహకు చిట్యాల రోజా, చక్రి ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించనున్నట్లు తెలిపారు.

ఆధార్ నమోదు, సవరణ ప్రక్రియలు ఎటువంటి పొరపాట్లు లేకుండా నిర్వహిస్తామని వారు హామీ ఇచ్చారు. వారి సేవా నిబద్ధతతో మండల ప్రజలకు ఆధార్ సంబంధిత సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో మీసేవ జిల్లా మేనేజర్ విజయ్, వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నూతన ఆధార్ సేవా కేంద్రం ప్రారంభంతో వెంకటాపురం మండల ప్రజలకు ఆధార్ సేవలు మరింత సులభంగా, వేగవంతంగా అందనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.