కార్పొరేట్ సంస్థల కోసం కార్మికుల హక్కులపై దాడి
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు
హుజూర్ నగర్, ఏప్రిల్ 27: దేశంలో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల లాభాల కోసం కార్మికుల హక్కులపై దాడి చేసి వారి హక్కులను కాలరాస్తుందని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుయల్లావుల రాములు అన్నారు. సోమవారం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో మామిడి వెంకయ్య అధ్యక్షతన జరిగిన మేడే సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చట్టాలను అందరూ ఐక్యంగా ఖండించాలన్నారు.కార్మిక వ్యతిరేక విధానాలను మే డే స్ఫూర్తితో వ్యతిరేకించాలన్నారు.
సిపిఐ పార్టీ కనీస వేతనం,నిర్ణీత పనిగంటలు, కార్మికుల ఉద్యోగ భద్రత అంశాలపై రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు.ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పబ్లిక్ సెక్టర్ ను కాపాడేందుకు సామాజిక న్యాయం కోసం కార్మిక ఉద్యమాలే మార్గమన్నారు.మేడే వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు మామిడి వెంకటేశ్వర్లు,కంబాల శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు,కొప్పోజు సూర్య నారాయణ,యల్లావుల రమేష్, తదితరులు, పాల్గొన్నారు.






