‘అసంపూర్తి’ భవిష్యత్!
- గాంధారి మండలంలో సర్కారు బడుల దుస్థితి
- మధ్యలోనే నిలిచిన భవన పనులు
- ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
గాంధారి, సెప్టెంబర్ 16 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) గాంధారి మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల భవనాలు(Government school buildings) అసంపూర్తిగా నిలిచిపోయాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు(Students) మెరుగైన విద్యతో పాటు సురక్షితమైన భవనాలు, అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది..
పలు పాఠశాలల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి గాంధారి మండల(Gandhari Mandal) కేంద్రంతో పాటు , నేరల్ తండా, రాంపూర్ గడ్డ, బూర్గుల్ గ్రామాల్లో కనిపిస్తోంది. కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి చేపట్టిన పాఠశాల భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోవడంతో భవనాలు శిథిలావస్థకు చేరుతున్నాయి.
నిర్మాణాలు మొదలై.. అడుగు ముందుకు పడని పరిస్థితి
పాఠశాలల కోసం నిర్మిస్తున్న భవనాల్లో పిల్లర్లు, గోడలు మాత్రమే కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల పునాదులు వేసి వదిలేయగా, మరికొన్ని ప్రాంతాల్లో స్లాబ్ దశకు చేరుకున్న నిర్మాణాలు కూడా పూర్తికాక నిరుపయోగంగా మారుతున్నాయి. మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అవరణలో నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ పూర్తయి ఆగిపోయింది..
ఏళ్ల తరబడి పనులు నిలిచిపోవడంతో నిర్మాణ ప్రాంతాల్లో పిచ్చిమొక్కలు పెరిగి, భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భవనాలు ఇలా ఉంటే చదువులు ఎలా?’
పాఠశాల భవనాల నిర్మాణాలు పూర్తికాకపోవడం విద్యార్థుల విద్యాభ్యాసంపై ప్రభావం చూపుతోంది. తరగతి గదుల కొరత, సరైన వసతులు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ముందుగా వారికి సురక్షితమైన, సౌకర్యవంతమైన పాఠశాల వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు..
ప్రజాధనం వృథా కాకుండా పనులు పూర్తి చేయాలి
పాఠశాల భవనాల నిర్మాణాలు మధ్యలో నిలిచిపోవడం వల్ల ఇప్పటికే చేసిన పనులు, వినియోగించిన నిధులు వృథా అయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, పెండింగ్లో ఉన్న నిర్మాణాలకు అవసరమైన నిధులు కేటాయించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
అధికారులు స్పందించాలి
గాంధారి మండలంలోని అసంపూర్తి పాఠశాల భవనాలపై విద్యాశాఖ, సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. నిర్మాణాల పురోగతిపై సమీక్ష నిర్వహించి, నిర్ణీత గడువులోగా భవనాలను అందుబాటులోకి తీసుకువస్తే విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించే అవకాశం ఉంటుంది. పాఠశాల భవనాలు పూర్తయితేనే విద్యార్థులకు భద్రత.. నాణ్యమైన విద్యకు సరైన వాతావరణం. అధికారులు ఇకనైనా స్పందించి అసంపూర్తి నిర్మాణాలకు ముగింపు పలకాలని ప్రజలు కోరుతున్నారు...