2 August, 2026 | 1:20 AM

లీకులపై ఉక్కుపాదం!

02-08-2026 12:00 AM
  1. ప్రపంచ దేశాల్లో కఠిన చట్టాలు
  2. భారత్‌లోనూ అమల్లోకి కఠిన చట్టం
  3. ప్రశ్నాపత్రం లీక్, ప్రాక్సీకి జైలు శిక్షలు, భారీ జరిమానా
  4. దేశ, విదేశాల్లోని నిబంధనలపై ఆసక్తికర చర్చ

హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ, నకిలీ అభ్యర్థులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉ పయోగించి జరిగే వ్యవస్థీకృత మోసాలపై ప్రపంచ దేశాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. పరీక్షల విశ్వసనీయతను దెబ్బతీసే ప్రతి చర్యను తీవ్రమైనా నేరంగా పరిగణిస్తూ జైలు శిక్ష లు, భారీ జరిమానాలు తదితర శిక్షలు విధిస్తున్నాయి. భారత్‌లో కూడా పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంపొందించేందుకు కఠిన చట్టం తీసుకువచ్చిన నేపథ్యంలో ఇతర దేశాల్లోని నిబంధనలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.   

చైనాలో ఏడేళ్ల వరకు జైలు

చైనాలో వ్యవస్థీకృత పరీక్షల మోసాలకు పాల్పడిన వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. తక్కువ తీవ్రత కలిగిన కేసుల్లో మూడేళ్ల వరకు జైలు, లేదా ఇతర క్రిమినల్ చర్యలు ఉంటాయి. ప్రశ్నపత్రాల లీకేజీలను ప్రభుత్వ రహస్యాల చట్టం కింద విచారించే అవకాశం ఉంది. మార్కులు లేదా పరీక్ష ఫలితాల రద్దు, సామాజిక విశ్వసనీయతకు సంబంధించిన బ్లాక్ లిస్టింగ్‌తో పాటు ఏళ్ల తరబడి పరీక్షలు రాయకుండా నిషేధం వంటి చర్యలూ ఉన్నాయి.

దక్షిణ కొరియాలో ఐదేళ్ల కారాగారం

దక్షిణకొరియాలో పరీక్షల మోసాలకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష లేదా 15 మిలియన్ వాన్ల వరకు జరిమానా విధించే అ వకాశం ఉంది. ప్రాక్సీ అభ్యర్థులు(అసలు అభ్యర్థికి బదులు మరొకరు), మోసాలకు పాల్పడే ముఠాలు, కృత్రిమ మేధ ఆధారిత పరికరాల వినియోగం, ప్రశ్నపత్రాల చోరీ వంటి నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటారు.  

అమెరికాలో ప్రత్యేక చట్టం లేకున్నా కఠిన చర్యలు

అమెరికాలో పరీక్షల మోసాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఒకే సమాఖ్య స్థాయి చట్టం లేదు. అయితే రాష్ట్రాల చట్టాలు, ఫెడరల్ చట్టాలు, పరీక్షల నిర్వహణ సంస్థల నిబంధనల ద్వారా చర్యలు తీసుకుంటారు. వ్యవస్థీకృత మోసాలు జరిగినప్పుడు మోసం, గుర్తింపు, కుట్ర, వైర్/మెయిల్ ఫ్రాడ్ వంటి అభియోగాలు నమోదు చేస్తారు. కొన్ని సందర్భాల్లో 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.   

ఫ్రాన్స్‌లో పదేళ్ల జైలు, ఇతర ఆంక్షలు

ఫ్రాన్స్‌లో ఇతరుల స్థానంలో పరీక్షలు రాయడం వంటి మోసాలకు పదేళ్ల వరకు జైలు శిక్ష, ఒక మిలియన్ యూరోల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఫోర్జరీకి మూడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది.  

బ్రిటన్‌లో వ్యవస్థీకృత చట్టాల కింద విచారణ 

బ్రిటన్‌లో  అనర్హత వేటు, పరీక్ష ఫలితాల రద్దు, భవిష్యత్తులో పరీక్షలపై నిషేధం వంటి చర్యలు ఉంటాయి. వ్యాసాలు రాసిచ్చే సంస్థలు, కాంట్రాక్ట్ చీటింగ్‌ను ‘స్కిల్ అండ్ పోస్ట్ ఎడ్యుకేషన్ యాక్ట్, 2022’ కింద నేరంగా పరిగణిస్తున్నారు. ఇతరుల స్థానంలో పరీక్షలు రాయడం, వ్యవస్థీకృత ప్రశ్నపత్రాల లీకేజీలను మోసానికి సంబంధించిన చట్టాల కింద విచారించి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

జపాన్‌లో మూడేళ్ల వరకు జైలు

జపాన్‌లో మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ప్రశ్నాపత్రాల లీకేజీలపై చోరీ, ఆస్తి దుర్వినియోగం లేదా విశ్వాస ఉల్లంఘన (బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్) వంటి అభియోగాలు నమోదు చేస్తారు. పరీక్ష ఫలితాల రద్దు, పలు సంవత్సరాలపాటు పరీక్షలపై నిషేధంతో పాటు కొన్ని సందర్భాల్లో పౌర బాధ్యతలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

చట్టాలను సమర్థంగా అమలు చేస్తేనే పరీక్షలపై విశ్వసనీయత  

  ప్రశ్నపత్రాల లీకేజీలు, ఒకరికి బదులుగా మరొకరు పరీక్షలు రాయడం, సమాధానాల విక్రయం మొదలుకొని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేసే మోసాల వరకు.. వాటిని అరికట్టేందుకు పలు దేశాలు  కఠిన శిక్షలు అమలు చేస్తున్నాయి. భారత్‌లోనూ నీట్ పేపర్ లీక్‌తో ఇటీవల ఢిల్లీలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో కేంద్రం కఠిన చట్టం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టాలను, సమర్థవంతంగా అమలు చేసినప్పుడే పరీక్షలపై విశ్వసనీయత పెరుగుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.