calender_icon.png 23 February, 2026 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం

23-02-2026 02:02:40 AM

రెండు రోజుల్లో 492 మందిపై కేసులు

హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 22 (విజయక్రాంతి) : హైదరాబాద్ నగర రోడ్లపై మందు బాబుల ఆట కట్టించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వీకెండ్ మత్తులో తూలుతూ వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. శుక్ర, శనివారాలు నగర వ్యాప్తంగా నిర్వహించిన భారీ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఏకంగా 492 మంది పట్టుబడటం గమనార్హం.

రోడ్డు ప్రమాదాలను నివారించడం ప్రయాణికుల భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన గణాంకాల ప్రకారం.. పట్టుబడిన వారిలో అత్యధికంగా 412 మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. 29 మంది ఆటో రిక్షా డ్రైవర్లు, 51 మంది కార్లు ఇతర భారీ వాహనాల డ్రైవర్లు పోలీసుల తనిఖీల్లో దొరికిపోయారు. వీరిపై ఎంవీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేశారు.

పట్టుబడిన వారందరినీ త్వరలోనే కోర్టు ముందు హాజరుపరచనున్నారు. వీరికి భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ స్పష్టం చేశారు. కేవలం వీకెండ్స్‌లోనే కాకుండా, నగరంలోని ప్రధాన కూడళ్లలో ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ఇతరుల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను గౌరవించాలని, ప్రాణాల పట్ల బాధ్యతగా ఉండాలని కోరారు.